ప్రముఖ కొరియోగ్రాఫర్, ఇటీవల జనసేన తరపున ప్రజల్లోకి విస్తృతంగా వస్తున్న జానీ మాస్టర్ పై రేప్ కేసు నమోదైంది. తనని రేప్ చేశాడని, ఔట్ డోర్ షూటింగ్ లకు వెళ్లినప్పుడు కూడా లైంగికంగా వేధించాడని ఓ మహిళా డ్యాన్సర్ ఆయనపై హైదరాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. రెండురోజుల క్రితం ఈ ఫిర్యాదు అందినా ఈరోజే ఇది వెలుగులోకి రావడం విశేషం. రాయదుర్గం పోలీసులు జీరో ఎఫ్ఐఆర్ నమోదు చేసి, కేసుని నార్సింగి పోలీస్ స్టేషన్కు బదిలీ చేశారు. నార్సింగి పోలీసులు విచారణ మొదలు పెట్టారు.
ఇటీవలే బెస్ట్ కొరియోగ్రాఫర్ గా జానీ మాస్టర్ జాతీయ అవార్డు కూడా అందుకున్నారు. తిరు చిత్రంబళం సినిమాలో పాటకు ఆయన నేషనల్ అవార్డ్ దక్కించుకున్నారు. ఇటు పొలిటికల్ గా కూడా ఆయన పేరు బాగా వినపడుతోంది. తాజా ఎన్నికల్లో ఆయన నెల్లూరు జిల్లా కోవూరు అసెంబ్లీ టికెట్ కోసం సీరియస్ గా ట్రై చేశారు. కొన్నాళ్లు అక్కడ ప్రచారం కూడా చేపట్టారు. కానీ ఆయనకు ఛాన్స్ రాలేదు. ఆ తర్వాత మళ్లీ సినిమాలపై ఫోకస్ పెట్టిన జానీ, ఇటీవల విజయవాడ వరదల సమయంలో జనసేన నేతలతో కలసి సహాయక కార్యక్రమాల్లో పాల్గొన్నారు. తాజాగా ఆయనపై రేప్ కేసు నమోదు కావడం సంచలనంగా మారింది.
జానీ మీద కంప్లయింట్ చేసిన డ్యాన్సర్ వయసు 21 ఏళ్లు. ఆమె కూడా కొరియోగ్రాఫర్ గా పనిచేస్తున్నట్టు తెలుస్తోంది. జానీతో కలసి కొన్ని సినిమాలకు ఆమె పనిచేశారు. పాటల షూటింగ్ కోసం చెన్నై, ముంబై వెళ్లినప్పుడు, మరికొన్నిచోట్ల ఔట్ డోర్ షూటింగ్ లకు వెళ్లినప్పుడు తనపై ఆయన లైంగిక దాడికి పాల్పడ్డాడని తన ఫిర్యాదులో సదరు డ్యాన్సర్ పేర్కొన్నారు. హైదరాబాద్ నార్సింగిలోని తన ఇంటిలో కూడా తనపై పలుమార్లు లైంగిక దాడికి పాల్పడ్డాడని కూడా ఫిర్యాదులో ఉన్నట్టు తెలుస్తోంది. ఈ వివాదంపై జానీ ఇంకా స్పందించలేదు.
ఇటీవల జానీ మాస్టర్ తో సతీష్ అనే డ్యాన్స్ మాస్టర్ కి గొడవలు జరిగాయి. జానీపై సతీష్ పోలీస్ కంప్లయింట్ కూడా ఇచ్చాడు. ఈ క్రమంలో సతీష్.. మరికొందరు డ్యాన్సర్లతో జానీపై తప్పుడు ఆరోపణలు చేయిస్తున్నారని అంటున్నారు. ఈ ఆరోపణల వెనక కూడా సతీష్ ఉన్నాడని జానీ సన్నిహితులు అనుమానిస్తున్నారు.