వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి బీజేపీతోనే పోటీ అని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి వ్యాఖ్యానించారు. ఎన్నికల తర్వాత బీఆర్‌ఎస్ మనుగడ రాష్ట్రంలో ప్రశ్నార్థకంగా మారనున్నదని అన్నారు. ఇవాళ సూర్యాపేటలో నిర్వహించిన సమావేశంలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ బీఆర్‌ఎస్‌పై తీవ్ర విమర్శలు చేశారు. రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ పని అయిపోయిందని వ్యాఖ్యానించారు. ఆ పార్టీ గురించి మాట్లాడితే సమయం వృథా అని అన్నారు.
లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి బీజేపీతోనే పోటీ ఉంటుందని ఉత్తమ్ కుమార్ రెడ్డి అభిప్రాయపడ్డారు. ఈ ఎన్నికల తర్వాత బీఆర్‌ఎస్ మనుగడ ప్రశ్నార్థకం కానుందన్నారు. తెలంగాణకు ఇచ్చిన వాగ్దానాలను అమలు చేయడంలో బీజేపీ విఫలం అయ్యిందని విమర్శించారు. ఆ పార్టీకి తెలంగాణలో ఓట్లు అడిగే హక్కు లేదని మండిపడ్డారు. కాళేశ్వరం అవినీతి గురించి ప్రధాని మోదీ మాట్లాడటం విడ్డూరంగా ఉందని అన్నారు. కాళేశ్వరం నిర్మాణానికి కేంద్ర సంస్థల రుణాలు ఏర్పాటు చేయించిన మోదీ ఇప్పుడిలా మాట్లాడటం ఏంటని నిలదీశారు.
మోదీ హయాంలో ప్రజాస్వామ్యం అణచి వేయబడుతోందన్నారు. వాగ్దానాలు నెరవేర్చని బీజేపీకి, మోదీకి ప్రజలు తగిన బుద్ధి చెప్పాలని పిలుపు ఇచ్చారు. లోక్‌సభ ఎన్నికల్లో దేశవ్యాప్తంగా కాంగ్రెస్ క్లీన్ స్వీప్ చేయడం ఖాయం అని ఉత్తమ్ ధీమా వ్యక్తం చేశారు. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి 13 లేదా 14 స్థానాలు వస్తాయని ఆయన అన్నారు.