తాను పోటీ చేసే సీటేదో కూడా చెప్పే ధైర్యం లేని వ్యక్తి పవన్ అని మంత్రి ఆదిమూలపు సురేష్(adimulapu suresh) ఎద్దేవా చేశారు. తాను ఎక్కడ పోటీ చేస్తాడో ప్రకటిస్తే సీఎం జగన్ అతనిపై బలమైన అభ్యర్థిని పెట్టి ఓడిస్తారనే భయంతో తన సీటును ప్రకటించలేకపోతున్నాడని తెలిపారు. 2014లో పార్టీ పెట్టిన పవన్ కల్యాణ్ దుస్థితి పదేళ్ల తర్వాత కూడా ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చని ఆయన చెప్పారు. తాను ఎక్కడ పోటీ చేస్తున్నాడో ఇంతవరకు నిర్ణయం కాలేదంటే పవన్ పరిస్థితి ఏంటో అర్థమవుతోందని తెలిపారు.
మంత్రి ఆదిమూలపు సురేష్ సింగరాయకొండలో ఆదివారం విలేకరులతో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. పదేళ్ల తన రాజకీయ ప్రస్థానంలో పవన్ కల్యాణ్(pawan kalyan) 24 సీట్లలో మాత్రమే పోటీ చేయడానికి ధైర్యం చేస్తున్నాడని ఆయన చెప్పారు. ఎవరైనా పార్టీ పెడితే అధికారంలోకి రావాలని, ప్రజలకు సేవ చేయాలని కోరుకుంటారని, కానీ పవన్ లాగా చంద్రబాబు అధికారంలోకి రావడం కోసం పార్టీ పెట్టరని మంత్రి విమర్శించారు.
టీడీపీ, జనసేన పొత్తు వన్ ప్లస్ వన్ కాదని.. వన్ మైనస్ వన్ జీరో అని మంత్రి ఆదిమూలపు స్పష్టం చేశారు. రానున్న ఎన్నికల్లో జనసేన పార్టీ ఎన్ని సీట్లలో పోటీ చేసినా చట్టసభల్లో ఆడుగుపెట్టే తలరాత వారికి లేదని ఆయన తేల్చిచెప్పారు. జనసేన సైనికులు ఆ విషయం తెలుసుకోవాలని హితవు పలికారు. రాష్ట్ర ప్రజలు టీడీపీ, జనసేన పొత్తును ఒప్పుకోవటం లేదని, వీరి పొత్తు అస్తమించే సూర్యుడు తప్ప ఉదయించే సూర్యుడు కాదని చెప్పారు. ఈ పొత్తు వలన సామాజిక వర్గం ఓట్లు బదిలీ అవుతాయనేది కేవలం వారి భ్రమేనన్నారు.