చంద్రబాబుపై మంత్రి బొత్స సత్యనారాయణ ఫైర్ అయ్యారు. రాష్ట్రంలో అప్పుల గురించి పదే పదే మాట్లాడుతున్న చంద్రబాబుకు, ఎల్లో మీడియాకు గట్టిగా కౌంటర్ ఇచ్చారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ చేసిన అప్పులన్నీ ప్రజా సంక్షేమం, అభివృద్ధి కోసమే ఖర్చు చేశారని.. రాష్ట్రానికి 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేసిన చంద్రబాబు మాత్రం ప్రజల సొమ్ము దోచుకుతిన్నాడని మంత్రి బొత్స సత్యనారాయణ మండిపడ్డారు. 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేసిన చంద్రబాబు రాష్ట్రానికి ఏం ఉద్ధరించాడో చెప్పాలని ఆయన నిలదీశారు. ప్రజలకు ఉపయోగపడే విధంగా, చరిత్రలో నిలిచిపోయే విధంగా ఏ ఒక్క కార్యక్రమం అయినా చేశాడా అని ప్రశ్నించారు. విజయనగరం జిల్లా చీపురుపల్లి మండలం గొల్లల ములగాంలో ఆదివారం బొత్స ఈ వ్యాఖ్యలు చేశారు.
ప్రభుత్వాలు అప్పులు చేయడం సహజమని, అయితే చేసిన అప్పులు ఏమయ్యాయో చూడాలని మంత్రి బొత్స చెప్పారు. చంద్రబాబు మాత్రం ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చేసిన అప్పులన్నీ రాష్ట్ర అభివృద్ధి కోసం వినియోగించకుండా సొంతంగా దోచుకుతిన్నాడని ధ్వజమెత్తారు. సీఎం వైఎస్ జగన్ తీసుకొచ్చిన గ్రామ సచివాలయ వ్యవస్థ దేవాలయంతో సమానమని మంత్రి చెప్పారు. గ్రామాల్లో ప్రజలకు ఎలాంటి కష్టం వచ్చినా సచివాలయానికి వెళితే పరిష్కారమవుతుందన్నారు.
ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులు మరో దశాబ్దకాలం తరువాత ప్రపంచంతో పోటీపడేలా ప్రస్తుతం పునాది పడుతోందని తెలిపారు. ఎనిమిదో తరగతి నుంచే బైజూస్ వంటి విలువైన కంటెంట్‌తో ట్యాబ్‌లు ఇచ్చి పేద విద్యార్థులకు డిజిటల్ విద్య అందిస్తున్నట్టు చెప్పారు. ఏపీలో అమలవుతున్న కార్యక్రమాలను దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో అమలు చేసేందుకు మనవైపు చూస్తున్నారని తెలిపారు. ఎల్లో మీడియా, చంద్రబాబు కలిసి రాష్ట్రాన్ని దోచుకునేందుకు జగన్ దిగిపోవాలి, చంద్రబాబు కుర్చీ ఎక్కాలి అనే కుట్రతో పనిచేస్తున్నారని ఆయన మండిపడ్డారు.