ఓవర్ యాక్షన్ చేస్తే రిజల్ట్ ఎలాగుంటుందో ఇప్పుడు వైసీపీలో అందరికీ తెలిసొస్తున్నట్లుంది. తాజాగా మంత్రి గుమ్మనూరు జయరామ్ వ్యవహారమే ఇందుకు నిదర్శనం. ఇంతకుముందే మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ళ రామకృష్ణారెడ్డి విషయంలో స్పష్టత వచ్చినప్పటికీ జయరామ్ ఓవర్ యాక్షన్ చేశారు. దాని ఫలితం ఏమిటంటే చివరకు పార్టీ మారక తప్పేట్లులేదు. వైసీపీలో రెండే మార్గాలుంటాయి. మొదటిదేమో జగన్మోహన్ రెడ్డి చెప్పినట్లు విని చెప్పిన నియోజకవర్గంలో పోటీ చేయటం.
రెండో పద్ధతి ఏమిటంటే తాను పోటీ చేయాల్సిన నియోజకవర్గంలో ఏవైనా ఇబ్బందులుంటే జగన్‌తో చెప్పుకుని సర్దుబాటు చేసుకోవటం. అయితే పై రెండు మార్గాలను కాదని బెదిరింపులకు దిగితే పార్టీలో చోటే ఉండదు. కర్నూలు జిల్లాలోని ఆలూరు ఎమ్మెల్యే గుమ్మనూరును సామాజికవర్గాల సమీకరణల్లో భాగంగా మంత్రివర్గంలోకి తీసుకున్నారు. మంత్రి పెర్ఫార్మెన్స్ ను పక్కనపెట్టి తప్పని పరిస్థితుల్లో కంటిన్యూ చేశారు. రాబోయే ఎన్నికల్లో గుమ్మనూరును ఆలూరు అసెంబ్లీకి కాకుండా కర్నూలు ఎంపీగా పోటీ చేయించాలని జగన్ అనుకున్నారు.
అయితే మంత్రి దాన్ని బాగా అలుసుగా తీసుకున్నారు. జగన్ నిర్ణయాన్ని పట్టించుకోకుండా తన మద్దతుదారులతో మాట్లాడి నిర్ణయం తీసుకుంటానని ప్రకటించారు. తర్వాత తాను ఎంపీగా పోటీ చేసేదిలేదని, ఆలూరులోనే పోటీ చేస్తానని ప్రకటించారు. మరోసారి ఎమ్మెల్యేగా తన కొడుక్కి టికెటిస్తే తాను ఎంపీగా పోటీ చేస్తానని కండీషన్ పెట్టారు. దాంతో విసిగిపోయిన జగన్ కర్నూలు ఎంపీగా, ఆలూరు ఎమ్మెల్యేగా వేరేవాళ్ళకి ఇన్‌చార్జి బాధ్యతలు అప్పగించారు. దాంతో షాక్ తిన్న మంత్రి జగన్‌ను కలిసేందుకు ప్రయత్నిస్తే అంగీకరించలేదు. జయరామ్ ఎంత ప్రయత్నించినా అపాయిట్మెంట్ దొరకలేదు.
కర్నూలుకు జగన్ వెళ్ళినపుడు మంత్రి కలిశారు కాని మాట్లాడలేదు. రెండు మూడు కార్యక్రమాలకు మంత్రి హాజరై జగన్‌తో మాట్లాడాలని ప్రయత్నించినా అవకాశం ఇవ్వలేదు. దాంతో తనకు పార్టీలో చోటు లేదని గుమ్మనూరుకు అర్థమైపోయింది. అందుకనే టీడీపీలోకి దూకాలని అనుకున్నారు. అయితే అక్కడ తమ్ముళ్ళు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. కాంగ్రెస్‌లోని తన సన్నిహితుల ద్వారా ఆలూరు టికెట్ కోసం జయరామ్ ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. మరి ఏ పార్టీలో చేరుతారో చూడాలి. బహుశా టికెట్ ఎక్కడ ఫైనల్ అయితే ఆ పార్టీలోకి గుమ్మనూరు చేరిపోతారేమో. అయినా చివరి ప్రయత్నంగా జగన్‌ను ఒకసారి కలుద్దామని నానా అవస్థలు పడుతున్నారట. ఓవర్ యాక్షన్ చేస్తే ఇలాగే ఉంటుందని పార్టీలో జయరామ్‌ను చూసి మాట్లాడుకుంటున్నారు.