మంత్రి సీదిరి అప్పలరాజు టీడీపీ అధినేత చంద్రబాబుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. శ్రీకాకుళంలో నిర్వహించిన ‘రా.. కదలిరా’ సభలో చంద్రబాబు చేసిన కామెంట్లపై మంత్రి బాబును ఫుల్లుగా కడిగేశారు. మంగళగిరిలో మంగళవారం జరిగిన సీఎం సభకు హాజరైన అప్పలరాజు ఈ సందర్భంగా విలేకరులతో మాట్లాడారు. చంద్రబాబు ఉత్తరాంధ్ర ద్రోహి అని ఆయన విమర్శించారు. ఉద్దానంలో వేల మంది చావులకు కారణం చంద్రబాబే అని మండిపడ్డారు. ఉత్తరాంధ్రలో వైసీపీ ఆధ్వర్యంలో జరిగిన అభివృద్ధిపై ఎవరు చర్చకు వచ్చినా తాము సిద్ధమని ఆయన సవాల్ చేశారు.
మళ్లీ జన్మభూమి కమిటీలు తెస్తావా?
సుపరిపాలన అంటే ఏంటి బాబూ.. మళ్లీ జన్మభూమి కమిటీలు తెస్తావా? అంటూ మంత్రి అప్పలరాజు నిలదీశారు. అప్రజాస్వామిక, రాజ్యాంగ విరుద్ధ మైన జన్మభూమి కమిటీల వల్ల సుపరిపాలన సాధ్యమా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. జన్మభూమి కమిటీలతో ప్రజలను దోపిడీ చేసిన చంద్రబాబు సుపరిపాలన గురించి మాట్లాడటం హాస్యాస్పదంగా ఉందన్నారు. శ్రీకాకుళం సభలో ప్రసంగించిన చంద్రబాబు.. మీ జిల్లాకు ఫలానా అభివృద్ధి కార్యక్రమం చేసినందుకు నాకు మళ్లీ అవకాశం ఇవ్వండని అడగలేకపోయారని మంత్రి నిలదీశారు. అంతటి దౌర్భాగ్యమైన పరిపాలన చంద్రబాబుదని విమర్శించారు.
40 రోజుల్లో బాబు రాజకీయ జీవితానికి ఎండ్ కార్డ్…
చంద్రబాబు తన హయాంలో చేసిన అభివృద్ధి ఏమీ లేదు కాబట్టే.. సీఎం జగన్‌పై బురద జల్లడమే పనిగా పెట్టుకున్నారని మంత్రి అప్పలరాజు మండిపడ్డారు. ఉద్దానంలో వేల మంది చావులకు చంద్రబాబు సమాధానం చెప్పాలని ఆయన నిలదీశారు. సీఎంగా ఉన్నప్పుడు చెత్త మీద పన్ను విధించాలని ప్రధానికి లేఖ రాసిన దౌర్భాగ్యపు వ్యక్తి చంద్రబాబు అని ఆయన గుర్తుచేశారు. ఇప్పుడు సీఎం జగన్ మీద అభాండాలు వేస్తున్నారని మండిపడ్డారు. 40 రోజుల్లో బాబు రాజకీయ జీవితానికి ఎండ్
కార్డ్ పడబోతోందని ఆయన స్పష్టం చేశారు.
సుపరిపాలన అంటే జగన్‌దే..
ఇటీవల ప్రకటించిన తొలి జాబితాలో చంద్రబాబు తన కులానికి ఇచ్చినన్ని సీట్లు కూడా పవన్‌కు ఇవ్వలేదని మంత్రి సీదిరి అప్పలరాజు ఎద్దేవా చేశారు. వైఎస్ జగన్ పాలనలో పేదరికం తగ్గిందని, సుపరిపాలన అంటే సీఎం జగన్ తీసుకొచ్చిన గ్రామ, వార్డు సచివాలయాలు.. వాటికి అనుసంధానంగా వచ్చిన వలంటీర్ వ్యవస్థ అని మంత్రి చెప్పారు. కులమతాలకు, పార్టీలకు అతీతంగా వైఎస్ జగన్ ప్రభుత్వం అందిస్తున్నదే సుపరిపాలన అని తెలిపారు. దీనివల్లే రాష్ట్రంలో పేదరికం గణనీయంగా తగ్గిందన్నారు. గతంలో 11.5 శాతం పేదరికం ఉంటే ఈ ఐదేళ్లలో 5 శాతం కంటే దిగువకు వచ్చిందని మంత్రి చెప్పారు. 2018 చంద్రబాబు విడుదల చేసిన నివేదికల్లో కూడా శ్రీకాకుళం, విజయనగరం జిల్లాలు వెనుకబడి ఉన్నాయని, అలాంటి వ్యక్తి ఇప్పుడు శ్రీకాకుళం జిల్లాను అభివృద్ధి చేస్తానంటూ డ్రామాలు ఆడుతున్నారని మండిపడ్డారు. 14 ఏళ్ల పాలనలో ఉత్తరాంధ్రకు ఏం చేశావ్? మా హయాంలో ఏం చేశామో ఎవరు వచ్చినా చర్చించడానికి సిద్ధం అని స్పష్టం చేశారు. మీరు పెట్టే సభ వద్దకు వచ్చి చర్చించడానికైనా నేను సిద్ధం అని సవాల్ చేశారు. వైఎస్ జగన్ పాలనలో ఉద్దానం కిడ్నీ రీసెర్చ్ హాస్పిటల్, రూ.700 కోట్లతో మంచినీటి ప్రాజెక్టుతో పాటు ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేశామని ఆయన తెలిపారు.