తన వయసు 72 ఏళ్లని, తనకు ఆరోగ్య సమస్యలు కూడా ఉన్నాయని, చట్ట విరుద్ధమైన చర్యలకు తాను పాల్పడలేదని చెబుతూ సత్యవేడు ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం ఏపీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. తనపై నమోదు చేసిన రేప్ కేసుని కొట్టేసేలా పోలీసులకు ఆదేశాలివ్వాలని ఆయన కోర్టుని అభ్యర్థించారు. ప్రాథమిక విచారణ చేయకుండా పోలీసులు కేసు నమోదు చేశారని తన పిటిషన్ లో పేర్కొన్నారు ఆదిమూలం.
ఏపీలో ఎమ్మెల్యే ఆదిమూలం వ్యవహారం సంచలనంగా మారిన విషయం తెలిసిందే. ఆరోపణలు వచ్చిన వెంటనే ఆయన్ను టీడీపీ సస్పెండ్ చేసింది. తిరుపతి తూర్పు పోలీసులు ఆయనపై కేసు నమోదు చేశారు. అస్వస్థతతో కొన్నిరోజులు ఆస్పత్రిలో చికిత్స తీసుకున్న ఆదిమూలం, తాను తప్పు చేయలేదంటూ కోర్టు మెట్లెక్కారు. అత్యాచారం జరిగిందనే అంశాలు ఫిర్యాదులో లేనందున తనను దోషిగా పేర్కొనడం సరికాదంటున్నారాయన. ఫిర్యాదు చేసిన మహిళను తాను బలవంత పెట్టినట్టు కూడా ఆమె పేర్కొనలేదన్నారు. వీడియో సాక్ష్యాలున్న సంఘటనలు జులై 6, 17, ఆగస్ట్ 10వతేదీల్లో జరిగినట్టు చెబుతున్నారని, అయితే వాటిపై సెప్టెంబర్ 5న పోలీసులకు ఫిర్యాదు చేయడమేంటని ఆయన ప్రశ్నిస్తున్నారు. ఆమె ఫిర్యాదులో దురుద్దేశం ఉందని చెబుతున్నారు ఆదిమూలం.
సదరు మహిళ ఫిర్యాదులో దురుద్దేశం ఉన్నా కూడా ఎమ్మెల్యే స్థాయి వ్యక్తి అలాంటి పనులు చేయడాన్ని సభ్యసమాజం హర్షించదని టీడీపీ భావించింది. అందుకే వెంటనే ఆయన్ను పార్టీనుంచి సస్పెండ్ చేసింది. వైసీపీ నేతల వ్యక్తిగత విషయాలు, వీడియోకాల్స్ వ్యవహారం ఇటీవల బయటపడినా ఆ పార్టీ నుంచి ఎలాంటి క్రమశిక్షణ చర్యలు తీసుకోలేదని టీడీపీ విమర్శిస్తోంది. ఈ రాజకీయ రచ్చను పక్కనపెడితే.. ఎమ్మెల్యే ఆదిమూలం పిటిషన్ పై హైకోర్టు ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో వేచి చూడాలి.