వైసీపీ షాకిస్తూ ఎమ్మెల్సీ పోతుల నిర్ణయం సంచలన నిర్ణయం తీసుకున్నారు. శాసనమండలి సభ్యత్వంతో పాటు వైసీపీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు. ఈ మేరకు రాజీనామా లేఖను పార్టీ అధినేత జగన్‌కు పంపినట్లు తెలుస్తోంది. త్వరలో భవిష్యత్ కార్యాచరణ ప్రకటించనున్నట్లు సునీత తెలిపారు.
అయితే సునీత తిరిగి తెలుగుదేశం పార్టీలో చేరుతారని ప్రచారం జరుగుతోంది. 2017లో టీడీపీ తరఫున ఎమ్మెల్సీగా ఎన్నికైన పోతుల సునీత.. 2020లో ఆ పార్టీకి పదవికి రాజీనామా చేసి జగన్ సమక్షంలో వైసీపీలో చేరారు. జగన్ సునీతకు ఎమ్మెల్సీగా అవకాశం కల్పించారు. పదవీకాలం ముగియడంతో మరోసారి ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీగా నామినేట్ చేశారు. పార్టీ మహిళా విభాగం అధ్యక్షురాలిగానూ నియమించి పార్టీలో సముచిత స్థానం కల్పించారు. అయినప్పటికీ పోతుల సునీత పార్టీకి రాజీనామా చేయడంపై విమర్శలు మొదలయ్యాయి.
టీడీపీ ఎమ్మెల్యే గౌతు శిరీషా కీలక వ్యాఖ్యలు చేశారు. ఎమ్మెల్సీ పోతుల సునీతను తెలుగుదేశం పార్టీలో చేర్చుకోవద్దని అధిష్టానానికి సూచించారు. ఊసరవెల్లి లాంటి నాయకులను పార్టీలోకి తీసుకోవద్దన్నారు. పదవుల కోసం ఇలాంటి వాళ్లను పార్టీలోకి తీసుకుంటే.. అధికారం లేనప్పుడు పోరాడినవాళ్లను అవమానించినట్టే అవుతుందని, పార్టీ కోసం కష్టపడినవారికి సరైన న్యాయం దక్కదన్నారు. గౌతు శిరీషా వ్యాఖ్యలతో పోతుల సునీతకు టీడీపీలోకి రీ-ఎంట్రీ కష్టంగా మారుతుందని అర్థం అవుతుంది.