బీజేపీతో పొత్తు తర్వాత టీడీపీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడికి కొత్త భయం పట్టుకుంది. ముస్లింల ఓట్లను చేజేతులా కోల్పోయే పరిస్థితి వచ్చిందని ఆయన ఆందోళన చెందుతున్నట్లు కనిపిస్తున్నారు. అందుకే ముస్లింలను బుజ్జగించే పనికి పూనుకున్నారు. ఇందులో భాగంగానే ముస్లిం సంఘాలతో ఆయన సమావేశమయ్యారు.
ముస్లిం మైనారిటీల అభివృద్ధికి ప్రత్యేకంగా డిక్లరేషన్ ప్రకటన చేస్తామని ఆయన ముస్లిం సంఘాల నాయకులతో చెప్పారు. రాష్ట్ర ప్రయోజనాల కోసమే బీజేపీతో పొత్తు పెట్టుకున్నామని, ముస్లింలు దూరదృష్టితో ఆలోచించి తనకు అండగా నిలబడాలని ఆయన కోరారు. గతంలో మతపరమైన అంశాల్లో జోక్యం చేసుకోలేదని, ఇప్పుడు కూడా ఏ విధమైన రాజీ ఉండదని ఆయన చెప్పారు.
అయితే, ముస్లింలు చంద్రబాబు మాటలను విశ్వసిస్తారా అనేది అనుమానంగానే ఉంది. గతంలో కూడా చంద్రబాబు ముస్లింలకు చేసింది ఏమీ లేదు. తన మంత్రివర్గంలో ముస్లింలకు ప్రాతినిధ్యం కల్పించలేదు. ఎన్నికలు సమీపిస్తున్నవేళ ఫరూక్‌ను మంత్రి వర్గంలో చేర్చుకున్నారు. ఈ డ్రామా ముస్లింలకు బాగానే అర్థమైంది. దీంతో ఆయనకు గత ఎన్నికల్లో పరాజయాన్ని చవిచూపించారు.
అయితే, ముస్లింలు మరో రకంగా ఆందోళన చెందుతున్నారు. టీడీపీ నాయకత్వంలోని కూటమి అధికారంలోకి వస్తే నాలుగు శాతం రిజర్వేషన్లు అమలు కావని వారు భావిస్తున్నారు. ముస్లింలకు రిజర్వేషన్లు తీసేస్తామని ఓ సందర్భంలో అమిత్ షా తెలంగాణలో అన్నారు. సీఏఏను అమలు చేసి తమ ఉనికికే ఎసరు పెట్టే ప్రమాదం ఉందని వారు ఆందోళన చెందుతున్నారు.
గతంలో మోదీతో విభేదించిన సందర్భంలో చంద్రబాబు.. ముస్లింలు ఎదుర్కోబోయే ప్రమాదం గురించి హెచ్చరించారు. అవసరాన్ని బట్టి మాటలు మార్చే చంద్రబాబును ముస్లింలు ఎలా నమ్ముతారనేది ప్రశ్న. ఆయన మాటలకు విశ్వసనీయత లేదనేది అనుభవంలో తేల్చుకున్నారు.