విజయవాడలో ఎన్నడూ ఎరుగని స్థాయిలో వరదలు బీభత్సం సృష్టిస్తున్నాయి. ఊహించని విపత్తుతో విజయవాడ నగర ప్రజలు అల్లాడిపోతున్నారు. చుట్టూ నీళ్లు.. ఎటూ పోయే దారి లేదు.. కనీస అవసరాలైన తాగునీరు, ఆహారం అందించేవారి కోసం ఎదురుచూడాల్సిన దయనీయ స్థితి.. రాత్రయ్యిందంటే అంధకారంలో భయంభయంగా బిక్కుబిక్కుమంటూ గడపాల్సిన భీతావహ పరిస్థితి.. ఇంతటి దారుణమైన పరిస్థితుల్లో రాష్ట్రంలోని కీలక నగరమైన విజయవాడలో ప్రజలు ఉండగా.. జనసేన పార్టీ అధ్యక్షుడిగా, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా, కూటమి ప్రభుత్వంలో కీలక నేతగా ఉన్న పవన్ కల్యాణ్ మాత్రం ఎక్కడా కనిపించకపోవడంపై నెటిజన్లు మండిపడుతున్నారు. సోషల్ మీడియాలో పవన్ తీరుపై రచ్చరచ్చ చేస్తున్నారు. బాధితులను పరామర్శించేందుకు, వారికి సాయం అందించేందుకు, వారి సమస్యలు తెలుసుకొని ఆదుకునేందుకు ఎలాంటి ప్రయత్నమూ చేయకపోగా.. కనీసం జాడ కూడా లేకపోవడం అత్యంత దారుణమని విమర్శిస్తున్నారు.
అటు సీఎం చంద్రబాబు నాయుడు, ఇటు మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి వరద ముంపు ప్రభావిత ప్రాంతాల్లో సోమవారం పర్యటించి బాధితులకు అందుతున్న సహాయ చర్యలపై ఆరా తీశారు. కానీ ఒక పార్టీకి అధ్యక్షుడిగా, డిప్యూటీ సీఎంగా ఉన్న పవన్ మాత్రం కనిపించడేం.. అంటూ సోషల్ మీడియా వేదికగా నిలదీస్తున్నారు. పవన్ ఎక్కడ.. అంటూ ప్రశ్నిస్తున్నారు. గతంలో చిన్న చిన్న విషయాలకే గొంతు చించుకుని, చొక్కా ఎగరేసుకుంటూ పెద్దగా అరిచే పవనాలు సార్.. ఇలాంటి ఆపదలో ఎక్కడికి వెళ్లారని సూటిగా ప్రశ్నిస్తున్నారు. డిప్యూటీ సీఎం పదవిలో ఉండి ఇంతటి నిర్లక్ష్యం వహించడమేంటని నెటిజన్లు మండిపడుతున్నారు.
ఇదిలావుంటే.. సోమవారం పవన్ కల్యాణ్ పుట్టినరోజు. ఆయన తన పుట్టిన రోజును ప్లాన్ చేసుకున్న విధంగా కుటుంబంతో కలిసి బయటికి వెళ్లి ఉంటాడని నెటిజన్లు భావిస్తున్నారు. దానిని ఎవరూ తప్పుపట్టకపోయినా.. కనీసం సోషల్ మీడియా వేదికగా అయినా ప్రజల బాగోగులపై స్పందించాలి కదా అంటూ ప్రశ్నిస్తున్నారు. మరో విషయమేంటంటే.. పుట్టినరోజు సందర్భంగా ట్విట్టర్‌లో తనకు విషెస్ చెప్పినవారికి పవన్ కృతజ్ఞతలు తెలియజేయడం. ఇక్కడే నెటిజన్లు పవన్ తీరుపై విరుచుకుపడుతున్నారు. కృతజ్ఞతలు తెలిపేందుకు సమయం ఉంది కానీ.. ప్రజలను పరామర్శించేందుకు లేదా అంటూ నిలదీస్తున్నారు. విపత్కర పరిస్థితుల్లో అందరికీ అందుబాటులో ఉండాల్సిన ప్రజాప్రతినిధి.. పుట్టినరోజు పేరుతో బయటికి రాకపోవడమేంటని ప్రశ్నిస్తున్నారు. మరి వీటిపై పవన్ ఎలా స్పందిస్తారో చూడాలి.