‘గ్రంధి శ్రీనివాస్‌ను తన్ని తరిమేయాలి.. పోయిన ఎన్నికల్లో భీమవరంలో నేను గెలిచుంటే పరిస్థితి ఇంకో విధంగా ఉండేది.. నేను భీమవరంను వదిలిపెట్టను’ ఇవి తాజాగా జనసేన అధినేత పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలు. జగన్మోహన్ రెడ్డిపైన నోటికొచ్చింది మాట్లాడటం మామూలైపోయింది. ఇక్కడ విషయం ఏమిటంటే పోయిన ఎన్నికల్లో తనను ఓడించిన గ్రంధి శ్రీనివాస్ గుర్తుకు వస్తే చాలు పవన్‌కు చెమటలు పడుతున్నట్లున్నాయి. అందుకనే పదేపదే గ్రంధినే తలచుకుంటున్నారు. తనను గెలిపించుంటే.. అని గడచిన ఐదేళ్ళుగా అంటున్నారంటే భీమవరంలో ఓటమి పవన్‌ను ఎంతగా కుంగదీసిందో అర్థమవుతోంది. భీమవరంను వదిలిపెట్టనని చెప్పిన పవన్ ఏం చేస్తారో మాత్రం చెప్పలేదు. రాబోయే ఎన్నికల్లో పోటీ చేస్తారా? లేకపోతే ఇల్లు తీసుకుని ఉంటారా?
ఇప్పుడు కూడా రాబోయే ఎన్నికల్లో తాను భీమవరంలో పోటీ చేస్తాను అని ప్రకటించే ధైర్యం చేయటంలేదు. ఒకవైపేమో తాను భీమవరాన్ని వదిలిపెట్టనని చెబుతున్నారు. మరోవైపేమో టీడీపీ మాజీ ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు(pulaparthi ramanjaneyulu)ను పోటీ చేయమని బతిమలాడుకుంటున్నారు. తాను పోటీ చేస్తే ఎలాగుంటుందని సర్వే చేయించుకున్న పవన్ చివరకు పులపర్తిని పోటీ చేయమని రిక్వెస్టు చేశారంటే అర్థమేంటి? తాను పోటీ చేస్తే గెలవననే ఫీడ్ బ్యాక్ వచ్చుంటేనే కదా మరొకరిని పోటీ చేయమని సీటు ఆఫర్ చేస్తుంది.
తాను పోటీ చేయబోయే నియోజకవర్గాన్ని ప్రకటించేంత ధైర్యం కూడా లేని పవన్ చీటికిమాటికి జగన్మోహన్ రెడ్డి లేదా గ్రంధిని చాలెంజ్‌లు చేస్తుండటమే విచిత్రంగా ఉంది. తాను ఎవరికి భయపడను అన్నది పవన్ ఊతపదమంతే. వాస్తవానికి రాబోయే ఎన్నికల్లో గెలుపుపై బాగా అనుమానంతో ఉన్నారు కాబట్టే పోటీచేసే నియోజకవర్గాన్ని రహస్యంగా ఉంచారు. నిజంగానే పవన్ ధైర్యస్తుడు అయితే పోటీ చేయబోయే నియోజకవర్గాన్ని ఎప్పుడో ప్రకటించుండేవారే. జనసేన పోటీ చేయబోయే 21 నియోజకవర్గాల్లో ఐదుచోట్ల అభ్యర్థులను ప్రకటించిన పవన్ తన నియోజకవర్గాన్ని మాత్రం ప్రకటించుకోలేదంటేనే సీన్ అర్థమైపోతోంది.
ఇంతోటిదానికి ఊరికే ఊకదంపుడు ఉపన్యాసాలు ఇస్తున్నారు. పొత్తు పెట్టుకున్నప్పుడు, 24 సీట్లు తీసుకున్నపుడు కూడా తాను వ్యూహాత్మకంగా వెళుతున్నట్లు పార్టీ నేతలకు పదేపదే చెప్పారు. తన వ్యూహాలను ఎవరు ప్రశ్నించద్దని కూడా వార్నింగ్ ఇచ్చారు. మరి పార్టీ పోటీ చేయబోయే స్థానాలను 24 నుండి 21కి తగ్గించుకోవటం వెనుక ఏ వ్యూహం ఉందో పవన్ చెప్పగలరా?