టీడీపీతో బీజేపీ పొత్తు పెట్టుకోవడానికి తాను పడిన కష్టాల గురించి జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ వివరించారు. అందుకు తాను ఎంత కష్టపడిందీ ఆయన భీమవరం పర్యటనలో వివరించారు. టీడీపీతో పొత్తుకు బీజేపీ నాయకులను ఒప్పించేందుకు చేసిన ప్రయత్నంలో తాను ఎంతో నలిగిపోయానని ఆయన చెప్పారు. రెండు చేతులు జోడించి, దండం పెట్టి టీడీపీతో పొత్తు పెట్టుకోవాలని తాను బీజేపీ జాతీయ స్థాయి నాయకులను అడిగినట్లు ఆయన తెలిపారు. బీజేపీ జాతీయ నాయకులతో ఎన్ని చీవాట్లు తిన్నానో ఎవరికీ తెలియదని ఆయన అన్నారు.
బీజేపీ, టీడీపీ, జనసేన కూటమి అంధ్రప్రదేశ్ ఎన్నికల్లో గెలిచి తీరుతుందని పవన్ కల్యాణ్ ధీమా వ్యక్తం చేశారు. ఏదేమైనప్పటికీ, వైఎస్ జగన్ మీద కక్షతో చంద్రబాబును గెలిపించాలని పవన్ కల్యాణ్ చాలా కాలంగా చెమటోడుస్తున్నారు. బీజేపీ నేతలతో తిట్లు తినడం పవన్ కల్యాణ్‌కు పెద్ద విషయమేమీ కాదు. చంద్రబాబుతో పొత్తు పెట్టుకోవడానికి బీజేపీ జాతీయ నాయకులు తొలుత ససేమిరా అన్నట్లు వచ్చిన వార్తలు నిజమేనని పవన్ కల్యాణ్ మాటలను బట్టి అర్థం చేసుకోవచ్చు. అయితే, పవన్ కల్యాణ్‌ను వదులుకోవడానికి ఇష్టపడని బీజేపీ టీడీపీతో పొత్తుకు అంగీకరించినట్లు భావించవచ్చు.
అయితే, టీడీపీతో పొత్తుపై బీజేపీ ఇప్పటికీ ఏమీ తేల్చలేదు. ఈ విషయంపై బీజేపీ ఎప్పుడు క్లారిటీ ఇస్తుందో కూడా తెలియదు. నిజానికి, ఆంధ్రప్రదేశ్‌లో బీజేపీకి ప్రాధాన్యత లేదు. మహారాష్ట్ర వంటి రాష్ట్రాల్లో వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో అత్యధిక సీట్లను సాధించడానికి అవసరమైన వ్యూహరచనలో బీజేపీ జాతీయ నాయకులు నిమగ్నమై ఉన్నారు. తమకు బలం ఉన్న కర్ణాటక రాష్ట్రంపై కూడా ఇంకా దృష్టి పెట్టలేదు. ఆంధ్రప్రదేశ్ గురించి వారు ఎప్పుడు ఆలోచిస్తారో కూడా తెలియని పరిస్థితి. ఎన్నికలు పూర్తిగా దగ్గరయ్యే వరకు లాగుతారా అనేది కూడా చెప్పలేం.