ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కి చెందిన పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ ప్రపంచ రికార్డ్ సాధించింది. రాష్ట్రవ్యాప్తంగా ఒకే రోజు 13,326 గ్రామ పంచాయతీల్లో గ్రామ సభలు నిర్వహించినందుకు గాను ఆ శాఖకు ఈ ఘనత దక్కినట్టు తెలుస్తోంది. డిప్యూటీ సీఎంగా పవన్ బాధ్యతలు చేపట్టిన 100 రోజుల్లోపే ఆయన శాఖ ఇలాంటి అరుదైన ఘనత సాధించడం విశేషం అని జనసైనికులు అంటున్నారు.
ఏపీలో గతంలో కూడా గ్రామ సభలు జరిగాయి. అయితే ఈసారి పవన్ కల్యాణ్ రాష్ట్రవ్యాప్తంగా ఒకేసారి సభలు జరిపించాలని అధికారుల్ని పురమాయించారు. ఆయనే స్వయంగా మైసూరావారిపల్లెలో జరిగిన సభలో పాల్గొన్నారు. ఇకపై ఆరునెలలకోసారి సభలు జరపాలని, గ్రామాల అభివృద్ధి, అందుబాటులో ఉన్న నిధుల గురించి ఆ సభల్లో చర్చ జరగాలని ఆయన సూచించారు. కూటమి అధికారంలోకి వచ్చాక ఆగస్ట్ 23న తొలిసారిగా రాష్ట్రవ్యాప్త సభలు జరిగాయి. ఈ సభల గురించి ముందుగానే వరల్డ్ రికార్డ్స్ యూనియన్ కి ప్రభుత్వం సమాచారం అందించింది. ఈ సభలపై పూర్తి సమాచారం సేకరించిన సంస్థ ప్రతినిదులు ఈరోజు ఆ రికార్డ్ ని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కి అందజేశారు.
https://x.com/JanaSenaParty/status/1835589925846008211
ఒకేరోజు అత్యధిక గ్రామసభలు జరిపినందుకు వరల్డ్ రికార్డ్ సర్టిఫికెట్ ని, మెడల్ ని వరల్డ్ రికార్డ్స్ యూనియన్ అఫిషియల్ రికార్డ్స్ మేనేజర్ క్రిస్టొఫర్ టేలర్ క్రాఫ్ట్.. పవన్ కల్యాణ్ కి అందజేశారు. హైదరాబాద్ లోని పవన్ నివాసంలో ఈ రికార్డ్ లను అందించారు. ఒకే రోజు పెద్ద సంఖ్యలో ప్రజల భాగస్వామ్యంతో సభలు నిర్వహించడం అతి పెద్ద గ్రామ పాలనగా గుర్తిస్తున్నట్లు వరల్డ్ రికార్డ్స్ యూనియన్ ప్రతినిధులు తెలిపారు.