జనసేన అధినేత పవన్ కల్యాణ్‌కు గండం తప్పేట్లులేదు. రాబోయే ఎన్నికల్లో గెలుపుపై భరోసా ఇచ్చే నియోజకవర్గం ఒక్కటీ కనబడటంలేదు. ఇప్పటికీ చాలా నియోజకవర్గాల పేర్లు ప్రచారంలోకి వచ్చిన విషయం తెలిసిందే. అయితే లేటెస్ట్‌గా పిఠాపురం నుండి పోటీ చేయటం ఖాయమని అంటున్నారు. ఎందుకంటే పవన్ గెలుపుపై నియోజకవర్గంలో సర్వేలు జరుగుతున్నాయట. పిఠాపురంలో సుమారు 2.5 లక్షల ఓట్లున్నప్పటికీ కాపుల ఓట్లు దాదాపు 70 వేలదాకా ఉన్నాయని తేలిందట.
ఇన్నివేల మంది కాపులున్నారు కాబట్టే గెలుపుపై నమ్మకంతో పిఠాపురం ఎంచుకున్నారని ప్రచారం పెరిగిపోతోంది. ఇదే సమయంలో పొత్తులో భాగంగా పిఠాపురంను జనసేనకు కేటాయించినట్లు చంద్రబాబునాయుడు ఫైనల్ చేశారట. ఇదే విషయాన్ని రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు టీడీపీ నేత ఎస్విఎస్ఎన్ వర్మకు చెప్పారట. అయితే అందుకు వర్మ అంగీకరించలేదని పార్టీ వర్గాల సమాచారం. నియోజకవర్గాన్ని పొత్తులో ఇతర పార్టీలకు కేటాయించటం కుదరదని వర్మ రివర్సులో అచ్చెన్నకు స్పష్టంగా చెప్పేశారట. ఒకవేళ పొత్తులో ఇతర పార్టీలకు ఇచ్చినా తాను మాత్రం కచ్చితంగా పోటీ చేస్తానని కూడా చెప్పారట.
టీడీపీ టికెట్ దక్కకపోతే స్వతంత్ర అభ్యర్థిగా అయినాసరే పోటీ చేయటం ఖాయమని అచ్చెన్నకు వర్మ తేల్చిచెప్పేశారట. 2009లో టీడీపీ తరపున పోటీ చేసిన వర్మ ఓడిపోయారు. అందుకని 2014లో చంద్రబాబు వర్మకు టికెట్ ఇవ్వకుండా పీవీ విశ్వంకు ఇచ్చారు. అయినా సరే వర్మ ఇండిపెండెంటుగా పోటీ చేసి గెలిచారు. 2019లో వర్మ మళ్ళీ టీడీపీ తరపున పోటీ చేసి ఓడిపోయారు. ఒకసారి గెలిచిన అనుభవం ఉంది కాబట్టి రాబోయే ఎన్నికల్లో మళ్ళీ ఇండిపెండెంటుగా పోటీ చేయటానికి వర్మ రెడీ అయిపోతున్నారు.
నియోజకవర్గంలో రెండో రోజుల క్రితం జరిగిన రోడ్డుషోలో మాట్లాడుతూ.. తాను కచ్చితంగా పోటీ చేయబోతున్నట్లు చెప్పారు. పార్టీ తరపునా లేకపోతే ఇండిపెండెంటుగానా అన్నది తొందరలోనే ప్రకటిస్తానన్నారు. తాను పోటీ చేయటానికి పార్టీ టికెట్టే అవసరంలేదని కూడా అన్నారు. పవన్ పేరును ప్రస్తావించకుండా నాన్ లోకల్స్ కు జనాలు ఓట్లేయరని స్పష్టంగా చెప్పారు. అందుకనే రాబోయే ఎన్నికల్లో తనకు ఓట్లేయమనే వర్మ ప్రచారం చేసుకుంటున్నారేకాని టీడీపీ కూటమికి ఓట్లేయమని జనాలను అడగటంలేదు. బహుశా సీటును జనసేనకు ఇచ్చేయబోతున్నట్లు వర్మకు సమాచారం ఉందేమో. మరి కూటమి తరపున పోటీ చేసినా వర్మ కూడా పోటీలో ఉంటే పవన్ ఓడిపోవటం ఖాయం. అందుకనే సేఫ్‌గా ఉంటుందని తిరుపతిలో పోటీ చేసే విషయాన్ని కూడా పవన్ ఆలోచిస్తున్నట్లు తాజా అప్ డేట్. మరి చివరకు ఏమవుతుందో చూడాల్సిందే.