ఆంధ్రప్రదేశ్‌లో టీడీపీ, జనసేన పొత్తుల వ్యవహారం ఎక్కడో తేడా కొట్టినట్లు అనిపిస్తోంది. అందుకు పవన్ ప్రవర్తనే కారణం. తాజాగా ఆయన టీడీపీ నేతలతో ప్రవర్తించిన తీరు మరింత అనుమానాలకు తావిస్తోంది. ఇప్పటికే జనసేన, టీడీపీ ఏ పార్టీకి ఆ పార్టీ తమ పార్టీ అభ్యర్థులను కన్ఫామ్ చేస్తున్నారనే వార్తలు వస్తున్నాయి. తాజాగా పవన్.. భీమవరంలో టీడీపీ నేతలకు ఊహించని షాకిచ్చాడు.
ఇంతకీ ఏం జరిగిందంటే.. నేడు పవన్ భీమవరం వచ్చారు. అక్కడ టీడీపీ నేతలను కలవాల్సి ఉంది. అయితే.. ఆయన కోసం ఎదురుచూసిన నేతలను కలవకుండానే పవన్ వెళ్లిపోయాడు. దీంతో టీడీపీ నాయకులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. టీడీపీ నాయకులు తమ పార్టీ కార్యాలయంలో పవన్ కల్యాణ్‌తో సమావేశం కోసం ఉదయం నుంచి నిరీక్షించారు. కేవలం భీమవరం నియోజకవర్గం నాయకులతోనే అని జిల్లా టీడీపీ అధ్యక్షురాలు సమావేశం ఏర్పాటు చేశారు.
ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల ఇన్‌చార్జిలతో మాత్రమే సమావేశం జరిగింది. పవన్ కల్యాణ్ అర్థంతరంగా వెళ్లిపోయారు. భీమవరం టీడీపీ నాయకులతో పవన్ కల్యాణ్ సమావేశం జరగలేదు. దీంతో టీడీపీ నాయకులు తీవ్రమైన అభ్యంతరాలు వ్యక్తం చేశారు. వారికి టీడీపీ నాయకుడు, మాజీ మంత్రి పితాని సత్యనారాయణ సర్ది చెప్పడానికి ప్రయత్నించారు. తమనే కలవకపోతే పవన్ కల్యాణ్ ప్రజలను ఎలా కలుస్తారని టీడీపీ నాయకులు ప్రశ్నించారు.
పవన్ కల్యాణ్ సమావేశం అని చెప్పి తమను ఇక ముందు భీమవరం పిలువొద్దని వీరవాసరం నాయకులు మండిపడ్డారు. మండలాలవారీగా సమావేశాలు పెట్టాలని సూచించారు. దీంతో పార్టీ నాయకులపై పితాని సత్యనారాయణ ఆగ్రహం వ్యక్తం చేశారు. మీటింగ్ ఎక్కడ పెట్టాలో చెప్పడానికి మీరెవరంటూ ఆయన మండిపడ్టారు. ఎన్నికలు దగ్గరపడుతున్న సమయంలో పవన్ ఇలా ఎందుకు ప్రవర్తిస్తున్నారో ఎవరికీ అర్థం కావడం లేదు.