వరదలు వచ్చిన వారం దాటిపోయిన తర్వాత ఎట్టకేలకు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ బురదలో దిగారు. కాకినాడ జిల్లా, పిఠాపురం నియోజకవర్గం, గొల్లప్రోలులో ఏలేరు, సుద్దగడ్డ ముంపు ప్రాంతాల్లో ఆయన పర్యటించారు. స్థానిక పరిస్థితులు అడిగి తెలుసుకున్నారు. ఆయన వెంట టీడీపీ నేత వర్మ, ఇతర నేతలు, అధికారులు ఉన్నారు. లైఫ్ జాకెట్ ధరించి పవన్ కల్యాణ్ పడవలో పరామర్శకు బయలుదేరారు.
వరదల ప్రభావం మొదలైన రెండు రోజుల తర్వాత పవన్ కల్యాణ్ మీడియాకు కనిపించారు. సహాయక చర్యల్లో ఎందుకు పాల్గొనడం లేదని ప్రతిపక్షం ప్రశ్నిస్తే ఆయన విచిత్రమైన జవాబిచ్చారు. తాను సీన్ లోకి వస్తే తనను చూసేందుకు జనం ఎగబడతారని, అందుకే తాను జనంలోకి రాలేదని చెప్పుకొచ్చారు. ఆ తర్వాత వైరల్ ఫీవర్ అంటూ ఓ ఫీలర్ వదిలారు జనసైనికులు. సమీక్షలు, సమావేశాలతో పవన్ బిజీ బిజీగా ఉన్నారని, ఆయన ప్రజల కోసమే ఆలోచిస్తున్నారని, వరదల సమయంలో ప్రజల్ని ఎలా రక్షించాలనే విషయంపై చర్చిస్తున్నారని అన్నారు. అంతా అయిపోయాక ఇప్పుడు పవన్ కల్యాణ్ సీన్ లోకి ఎంట్రీ ఇచ్చారు.
https://www.youtube.com/live/1UhwGocthx0?si=1Ag7Y7dFV9dXdHZm
పవన్ ఫీల్డ్ లోకి వచ్చాక మరి జనం ఎగబడకపోతే ఆయన ఇమేజ్ డ్యామేజీ అయిపోతుంది కదా, అందుకే హడావిడి కాస్త గట్టిగానే మొదలైంది. పిల్లలు సైతం పవన్ కల్యాణ్ వెంట పరుగులు పెట్టారు. జై పవన్ అనే నినాదాలు మారుమోగిపోయాయి. డిప్యూటీ సీఎం పవన్ వెంట అధికారులు కూడా హడావిడిగా గ్రామాల్లోకి వచ్చారు.
రాష్ట్రవ్యాప్తంగా వరదల కారణంగా దెబ్బతిన్న దాదాపు 400 గ్రామపంచాయతీలకు, తన స్వార్జితం నుండి ఒక్కో పంచాయతీకి లక్ష రూపాయల చొప్పున పవన్ విరాళం ప్రకటించిన విషయం తెలిసిందే. ఆ విరాళాల వితరణ కూడా ఈరోజు మొదలైంది. జనసేన పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు ఆయా పంచాయతీలకు విరాళం చెక్కులు అందజేస్తున్నారు.