మొన్నటి ఎన్నికల్లో బీజేపీకి 1 శాతం ఓట్లు కూడా లేవు. జనసేనకు వచ్చిన ఓట్లు 5.6 శాతం. గత ఎన్నికల్లో ఎదురైన అనుభవంతో రాబోయే ఎన్నికల్లో జనసేన అధినేత పవన్ కల్యాణ్ టీడీపీతో పొత్తు పెట్టుకుని పోటీ చేస్తున్నారు. మొన్న చంద్రబాబుతో జరిగిన భేటీలో జనసేనకు 25 అసెంబ్లీ, 2 పార్లమెంటు సీట్లు తీసుకున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ ఫిగర్స్ నిజమే అని జనసేన వర్గాలు చెబుతున్నాయి. ఇక్కడే పవన్ నాయకత్వంపై జనసేన నేతల్లో, కాపు ప్రముఖుల్లో అనుమానాలు మొదలయ్యాయి.
సీన్ కట్ చేస్తే ఈ కూటమిలో బీజేపీ కూడా చేరబోతోందనే ప్రచారం ఒక్కసారిగా పెరిగిపోయింది. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాతో చర్చలు జరిపేందుకు చంద్రబాబు ఢిల్లీకి వెళ్ళారు. టీడీపీ నేతల సమాచారం ప్రకారం 15 అసెంబ్లీ, పది పార్లమెంటు సీట్లను బీజేపీ నేతలు కోరుతున్నారట. వాళ్ళు అడిగినన్ని కాకపోయినా ఎన్నో కొన్ని సీట్లను చంద్రబాబు వదులుకోక తప్పదు. అరకు, విశాఖపట్నం, రాజమండ్రి, ఏలూరు లేదా నరసాపురం, కాకినాడ, ఒంగోలు లేదా నెల్లూరు, మచిలీపట్నం, తిరుపతి, రాజంపేట, అనంతపురం లేదా హిందుపురం పార్లమెంటు సీట్లను కోరుతోందని ప్రచారం జరుగుతోంది.
15 అసెంబ్లీ, 10 పార్లమెంటు సీట్లు ఇస్తారా లేదా అన్నది అప్రస్తుతం. అడిగిన దాంట్లో బీజేపీకి సగం సీట్లయినా ఇవ్వక తప్పదని అర్థమవుతోంది. ఎందుకంటే బీజేపీతో పొత్తుకు ఐదేళ్ళుగా శతవిధాలుగా ప్రయత్నిస్తున్నారు చంద్రబాబు. పొత్తుకు ఒప్పుకోవటమే చాలా ఎక్కువ కాబట్టి బీజేపీ అడుగుతున్న దాంట్లో కనీసం సగమైనా చంద్రబాబు ఇవ్వాల్సిందే.
ఇక్కడే పవన్ కెపాసిటి ఏమిటో అర్థమైపోయింది. ఒక్క శాతం ఓట్ షేర్ కూడా లేని బీజేపీ అన్ని సీట్లు తీసుకుంటే 5.6 శాతం ఓట్లున్న జనసేన ఎన్ని సీట్లు తీసుకోవాలి? అన్న విషయం పైనే ఇప్పుడు చర్చ మొదలైంది. పొత్తు చర్చల కోసం పవన్‌ను తన ఇంటికి పిలిపించుకున్న చంద్రబాబు అదే పొత్తు చర్చల కోసం ఢిల్లీకి పరిగెత్తుకుంటూ వెళ్ళటాన్ని అందరు ఆశ్చర్యంగా చూస్తున్నారు. బీజేపీతో పొత్తు కోసం చంద్రబాబు అర్రులు చాచటం చూస్తుంటే.. పొత్తు కుదిరితే తర్వాత పవన్‌ను లెక్కచేస్తారా? అని కాపుల్లో అనుమానాలు పెరిగిపోతున్నాయి.