విజయవాడ వరద బాధితులకోసం ఏపీ ప్రభుత్వం విరాళాలు సేకరిస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో పశ్చిమగోదావరి జిల్లాలోని ఓ ప్రైవేట్ స్కూల్ విద్యార్థులు విరాళాలిస్తున్న దృశ్యాలు ఇటీవల సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఆ వీడియోని సీఎం చంద్రబాబు కూడా తన వ్యక్తిగత ట్విట్టర్ అకౌంట్ లో పోస్ట్ చేశారు. ఈరోజుకిది చాలు అనేట్టుగా ఆ వీడియో ఉందని, తనకెంతో తృప్తినిచ్చిందని చంద్రబాబు కామెంట్ కూడా పెట్టారు. నిజమైన రేపటి పౌరులు వీరేనంటూ పిల్లల్ని అభినందించిన చంద్రబాబు, పొరుగువారికి సాయపడాలనే బాధ్యతను నేర్పించిన టీచర్లకు ధన్యవాదాలు తెలిపారు.
https://x.com/ncbn/status/1833090947632005346
అయితే చంద్రబాబు ఈ వీడియోని రాజకీయం కోసం వాడుకున్నారంటూ వైసీపీ కౌంటర్ ఇచ్చింది. నీ పబ్లిసిటీ పిచ్చిలో పిల్లల్ని కూడా వదలవా చంద్రబాబూ అంటూ వైసీపీ నుంచి ట్వీట్ పడింది. తల్లికి వందనం అంటూ ఇంట్లో ఎంత మంది పిల్లలు ఉంటే అంత మందికీ రూ.15,000 ఇస్తానని హామీ ఇచ్చి, అధికారంలోకి వచ్చాక ఏదీ ఇవ్వకుండా నిండా ముంచేశావంటూ వైసీపీ బదులిచ్చింది. పిల్లల కోసం ఇస్తానన్న డబ్బు ఎగరగొట్టేసి, తిరిగి వారి దగ్గరే వసూళ్లు మొదలు పెట్టిన చంద్రబాబు.. ఇలాగే సంపద సృష్టిస్తారా అంటూ వ్యంగ్యాస్త్రాలు విసిరింది.
https://x.com/YSRCParty/status/1833171358139724253
వైసీపీ కౌంటర్ కి వెంటనే టీడీపీ బదులిచ్చింది. జగన్ ఉక్రోషం తట్టుకోలేక పోతున్నారని, ఇంతటి విపత్తులో రాష్ట్రం మొత్తం ఏకమవడం చూసి, ఏడుస్తున్నారని ట్వీట్ చేసింది. కులం, మతం, ప్రాంతంతో ప్రజల్ని విడగొట్టాలని జగన్ చూస్తుంటే, చంద్రబాబు అందర్నీ కలిపి ప్రేమతో ముందుకు వెళ్తారని చెప్పింది. పసి పిల్లల వీడియో చుట్టూ విమర్శలు, ప్రతి విమర్శలు చెలరేగడం ఏపీ పొలిటికల్ సీన్ కి అద్దం పడుతోందని అంటున్నారు నెటిజన్లు.