ఒకేరోజులో 11 లక్షల క్యూసెక్కుల వరద వచ్చినా తట్టుకుని నిలిచిన గేట్లు అవి, ఇక డ్యామ్ భద్రత గురించి ఎక్కడా ఏ చిన్న అనుమానం కూడా లేదు. అలాంటి ప్రకాశం బ్యారేజ్ నాలుగైదు పడవలు వచ్చి ఢీకొంటే ధ్వంసం అవుతాందా..? గేట్లు విరిగిపోతాయా..? అసలిలాంటి అనుమానం ఎవరికైనా వస్తుందా..? కానీ ఏపీ పోలీసులకు వచ్చింది. ప్రాథమిక విచారణలో ఆ అనుమానం నిజమేనని తేల్చారు. ప్రకాశం బ్యారేజ్ ని ఇటీవల పడవలు ఢీకొన్న ఘటనలో కుట్రకోణం ఉందని అంటున్నారు.
https://x.com/JaiTDP/status/1832794031794905234
అసలీ అనుమానం ముందుగా సోషల్ మీడియా జనాలకు వచ్చింది. ఆ తర్వాత మంత్రులు కూడా అలాంటి అనుమానాలే వ్యక్తం చేశారు. చివరిగా సీఎం చంద్రబాబు నోటి వెంట కూడా కుట్రకోణం అనే మాట వినపడటంతో చకచకా పోలీసులు ఆ కోణంలో దర్యాప్తు ప్రారంభించారు. ఆ బోట్లకు వైసీపీ రంగులు ఉండటంతో అది కుట్రేనని ప్రాథమికంగా తేల్చేశారు. టీడీపీ అనుకూల మీడియా దీన్ని చిలువలు పలువలు చేస్తూ వార్తలిస్తోంది.
ఆ పడవల యజమానులు వైసీపీకి సానుభూతిపరులే కావొచ్చు, వాటికి వైసీపీ రంగులే ఉండొచ్చు, వైసీపీ లోని కీలక నేతలతో వారికి పరిచయం కూడా ఉండొచ్చు. కానీ పడవలతో డ్యామ్ ధ్వంసం చేయొచ్చనే ప్లాన్ వేశారని, దాన్ని అమలు చేశారని ఆరోపించడమే కాస్త విచిత్రంగా తోస్తోంది. ప్రభుత్వాన్ని అప్రతిష్టపాలు చేసేందుకే ఇలాంటి కుట్రపన్నారంటూ వైసీపీపై ఆరోపణలు చేయడం పొలిటికల్ సీన్ ని మరింత వేడెక్కించింది.
జగన్ చేసిన మ్యాన్ మేడ్ ఫ్లడ్స్ అనే ఆరోపణలకు ఇది టీడీపీ ఇచ్చిన కౌంటర్ అనుకోవచ్చు. చంద్రబాబు ఇల్లు కృష్ణా నదికి ఓవైపు ఉంటే, మరోవైపు బుడమేరు గేట్లు ఎత్తేసి చంద్రబాబు ఇల్లు మునగకుండా చేశారని, కావాలనే విజయవాడను ముంచేశారని జగన్ చేసిన ఆరోపణలు కూడా వాస్తవానికి కాస్త దూరంగానే ఉన్నాయి. వరదల్ని అధికారుల నిర్లక్ష్యం అనుకోవచ్చు, వాతావరణ శాఖ హెచ్చరించినా ప్రభుత్వం పట్టించుకోకుండా బెజవాడను ముంచేసింది అని కూడా భావించవచ్చు. అంతేకానీ చంద్రబాబు ఇంటికోసం బెజవాడను ముంచారనేది మాత్రం అతిశయోక్తిలాగే అనిపిస్తుంది. ఇప్పుడు బెజవాడను ముంచేస్తే, రేపు ఎన్నికల్లో వాళ్లే తమ పార్టీకి ఓట్లు వేయాలన్న స్పృహ చంద్రబాబుకి ఉండదా..? ముఖ్యమంత్రి స్థాయిలోని వ్యక్తి ఆమాత్రం ఆలోచించకుండా.. నా ఇంటికోసం ప్రజల ఇళ్లని ముంచండి అని అధికారుల్ని ఆదేశిస్తారా..? పోనీ అధికారులే సొంత నిర్ణయంతో అలాంటి పని చేసి ప్రజల ప్రాణాలు తీస్తారా..? బాబు ఇంటికోసం బెజవాడను ముంచారనేది ఎంత నిజమో.. ప్రకాశం బ్యారేజ్ ని పడవలతో ధ్వంసం చేయబోయారనేది కూడా అంతే నిజం. పోలీసుల విచారణ ఏం తేల్చినా.. నిజానిజాలని ప్రజలే నిర్థారించుకోవాలి.