మెగాస్టార్ చిరంజీవి తనయుడు, ప్రముఖ నటుడు రామ్ చరణ్ తన తల్లి సురేఖతో కలిసి కొద్దిసేపటి కిందట పిఠాపురానికి చేరుకున్నారు. ముందుగా ఆయన పిఠాపురంలోని కుక్కుటేశ్వర స్వామి ఆలయాన్ని సందర్శించి ఆ తర్వాత పవన్ కల్యాణ్‌కు మద్దతుగా ప్రచారం నిర్వహించనున్నారు. పిఠాపురంలో పోటీ చేస్తున్న పవన్ గెలుపు కోసం చిరంజీవి కుటుంబ సభ్యులందరూ ప్రచారం నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే మెగా కుటుంబానికి చెందిన వరుణ్ తేజ్, సాయి ధరమ్ తేజ్, వైష్ణవ్ తేజ్ పిఠాపురంలో ప్రచారం నిర్వహించారు.
చిరంజీవి కూడా తన తమ్ముడు పవన్‌ను పిఠాపురంలో గెలిపించాలని ఒక వీడియో విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో మెగా కుటుంబానికి చెందిన రామ్ చరణ్ కూడా తన బాబాయ్ పవన్ గెలుపు కోసం పిఠాపురంలో ప్రచారం నిర్వహించేందుకు వచ్చారు. ఆయన తన తల్లి సురేఖ, మేనమామ అల్లు అరవింద్‌తో కలిసి పిఠాపురానికి వచ్చారు.
ముందుగా వారు స్థానికంగా ఉన్న కుక్కుటేశ్వర స్వామి ఆలయంలో పూజలు చేయనున్నారు. అనంతరం పవన్ కల్యాణ్‌తో భేటీ కానున్నారు. ఆ తర్వాత రామ్ చరణ్ తన తల్లి సురేఖ, మేనమామ అల్లు అరవింద్‌తో కలిసి పిఠాపురంలో ప్రచారం నిర్వహించనున్నట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే మెగా కుటుంబానికి చెందిన అల్లు అర్జున్, అల్లు శిరీష్ కూడా పిఠాపురంలో పవన్ కల్యాణ్‌ను గెలిపించాలని సోషల్ మీడియా వేదికగా ప్రజలను కోరారు.