పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రజల ప్రయోజనం కోసం అవసరమైతే తాను రాజీనామా చేసేందుకు కూడా సిద్ధంగా ఉన్నట్టు ప్రకటించారు. మెడికల్ కాలేజీలో ట్రైనీ మహిళా డాక్టర్‌పై జరిగిన హత్యాచార ఘటన నేపథ్యంలో బాధితురాలికి న్యాయం చేయాలంటూ జూనియర్ వైద్యులు నిరసనలు నెలరోజులకు పైగా కొనసాగిస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే వారితో చర్చలు జరిపేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. ఇందులో భాగంగా బుధవారం సాయంత్రం చర్చలకు రావాలని ఆహ్వానించగా.. 30 మంది ప్రతినిధులను అనుమతించాలని, ఈ భేటీని ప్రత్యక్ష ప్రసారం చేయాలంటూ వారు షరతులు విధించారు. వాటిని తిరస్కరించిన ప్రభుత్వం గురువారం మరోసారి చర్చలకు ఆహ్వానించింది. ఈ క్రమంలోనే వైద్యులు రాష్ట్ర సచివాలయానికి చేరుకున్నప్పటికీ.. సమావేశానికి మాత్రం హాజరుకాలేదు.
ప్రతిష్టంభన కొనసాగుతున్న వేళ సీఎం మమతా బెనర్జీ స్పందిస్తూ.. పై వ్యాఖ్యలు చేశారు. వైద్యులతో సమావేశం కోసం గురువారం దాదాపు రెండు గంటలపాటు ఎదురుచూశానని, అయినప్పటికీ వారి నుంచి స్పందన లేకుండా పోయిందని ఈ సందర్భంగా ఆమె తెలిపారు. నేటితో ఈ సమస్యకు తెరపడుతుందని ఆశించిన రాష్ట్ర ప్రజలకు క్షమాపణలు చెబుతున్నానన్నారు. ప్రస్తుతం ఈ కేసు కోర్టు పరిధిలో ఉన్నందువల్ల.. జూనియర్ వైద్యులు డిమాండ్ చేసినట్టు చర్చలను ప్రత్యక్ష ప్రసారం చేయలేమని తెలిపారు. ఈ సమావేశం వీడియో రికార్డింగ్‌కి మాత్రం ఏర్పాట్లు చేశామని, సుప్రీంకోర్టు అనుమతితో ఆ ఫుటేజీని వైద్యులకు అందజేస్తామని చెప్పారు.
చర్చలు జరిపేందుకు తాను ఇప్పటికే మూడుసార్లు యత్నించానని మమతా బెనర్జీ తెలిపారు. వైద్యులు విధులకు దూరంగా ఉండటంతో ఏడు లక్షల మంది రోగులు ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు. ఇప్పటికే 27 మంది మృతి చెందారని తెలిపారు. ఆందోళన చేస్తున్న జూనియర్ డాక్టర్లపై ఎలాంటి చర్యలు తీసుకోనని, నిరసనలు విరమించాలని కోరారు.