ఏపీలో ఘోర ప్రమాదం జరిగింది. చిత్తూరు జిల్లా బంగారుపాళ్యం మండలం మొగలికనుమ వద్ద జరిగిన రోడ్ యాక్సిడెంట్ లో 8 మంది స్పాట్ లోనే చనిపోయారు. మరో 30మంది తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వారిలో పలువురి పరిస్థితి విషమంగా ఉంది. ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నా కూడా కొంతమంది స్పందించడంలేదు. మృతుల సంఖ్య పెరిగే అవకాశముందని తెలుస్తోంది.
బస్సు, రెండు లారీలు ఢీ..
బంగారుపాళ్యం వద్ద ఉన్న మొగలికనుమ రహదారి ఘాట్ రోడ్ తో ఉంటుంది. ఈ రోడ్ లో తరచూ ప్రమాదాలు జరుగుతుంటాయి. ఈరోజు జరిగిన ప్రమాదంలో ఒక బస్సు, రెండు లారీలు ఢీకొన్నాయి. ఆర్టీసీ బస్సు డ్రైవర్ సహా 8మంది స్పాట్ లోనే చనిపోవడం ప్రమాద తీవ్రతకు అద్దం పడుతోంది. ఓవర్ స్పీడ్ లో వస్తున్న లారీ అదుపు తప్పి ఎదురుగా వస్తున్న బస్సుని ఢీకొంది. ఆ తర్వాత మరో లారీ ఆ బస్సుని ఢీకొనడంతో ప్రమాద తీవ్రత పెరిగింది. 8 మంది చనిపోగా 30మంది ప్రయాణికులకు గాయాలయ్యాయి. బస్సు ఓవైపు నుజ్జు నుజ్జుగా మారింది.
చిత్తూరు జిల్లా కలెక్టర్, ఎస్పీ హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకున్నారు. గాయపడిన వారిని ఆస్పత్రులకు తరలించారు. ప్రాణాపాయంలో ఉన్న ఐదుగురిని వెల్లూరు ఆస్పత్రికి తీసుకెళ్లారు. ఈ ప్రమాద వివరాలు అడిగి తెలుసుకున్న సీఎం చంద్రబాబు క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని అధికారులను ఆదేశించారు. బాధిత కుటుంబాలను ప్రభుత్వం ఆదుకుంటుందని హామీ ఇచ్చారు.