చట్టసభల్లో సభ్యులైన ఎంపీలు, ఎమ్మెల్యేలకు లంచం తీసుకుంటే చట్టపరంగా రక్షణ కల్పించడం కుదరదని సుప్రీంకోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. అసెంబ్లీలో లేదా పార్లమెంట్‌లో ప్రశ్నలు అడిగేందుకు, ప్రసంగించేందుకు, ఓటేసేందుకు డబ్బులు తీసుకుంటే వారికి రక్షణ కల్పించలేమని స్పష్టం చేసింది. వారిని విచారించి, చర్యలు తీసుకోవాల్సిందేనని అన్యాపదేశంగానే సర్వోన్నత న్యాయస్థానం చెప్పినట్లయింది.
పార్లమెంటరీ చట్టప్రకారం రక్షణ ఇవ్వాలా?
2012లో రాజ్యసభ ఎన్నికల్లో జార్ఖండ్ ముక్తిమోర్చా (జేఎంఎం) ఎమ్మెల్యే సీతా సొరెన్ ఒక పార్టీ అభ్యర్థికి ఓటేయడానికి డబ్బులు తీసుకుని, మరొకరికి ఓటేశారని ఆరోపణలు వచ్చాయి. ఈ అంశం తీవ్ర సంచలనంగా మారడంతో సీబీఐ క్రిమినల్ కేసు నమోదు చేసింది. ఆ కేసును కొట్టేయాలంటూ సీతా సొరెన్ హైకోర్టు కెళ్లారు. హైకోర్టు నిరాకరించడంతో సుప్రీంకోర్టుకు వెళ్లారు.
ఆ కేసును విచారిస్తున్న సందర్భంగా సుప్రీం కోర్టు బెంచ్ సోమవారం ఈ వ్యాఖ్యలు చేసింది. పార్లమెంటరీ చట్టం ప్రకారం రక్షణ అంటే ఇది కాదని.. లంచం తీసుకున్నవాళ్లను రక్షించడానికి అందులో అవకాశం లేదని వ్యాఖ్యానించింది.