రెండు తెలుగు రాష్ట్రాల్లో వరదలు పెను విపత్తుగా మారాయి. ఇంకా సహాయక చర్యలు పూర్తి కాలేదు, వరద విలయం నుంచి ప్రజలు బయటపడలేదు. అయితే ఈ వరదలు రాజకీయ రచ్చగా మారాయి. చంద్రబాబు సీఎంగా ఉన్నారు కాబట్టి ఈ వరదలను తట్టుకుని బెజవాడ బతికి బట్టకట్టిందని టీడీపీ చెప్పుకుంటోంది. ఇలాంటి సమయంలో జగన్ సీఎంగా లేకపోవడం దురదృష్టకరం అని వైసీపీ సానుభూతిపరులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అటు తెలంగాణలో ప్రభుత్వం చురుగ్గా స్పందించిందని కాంగ్రెస్ అనుకూల మీడియా బాకాలూదుతోంది. జలవిలయంపై కేసీఆర్ పూర్తిగా మౌనం వహించారు, విదేశాల నుంచి ట్వీట్లు వేస్తూ కేటీఆర్ కాలం గడుపుతున్నారు. ఈ క్రమంలో తెలంగాణ, ఏపీ మధ్య ఆసక్తికర పోలిక తీసుకొచ్చారు సీఎం రేవంత్ రెడ్డి. తెలంగాణతో పోల్చి చూస్తే ఏపీ అప్రమత్తత అంతంతమాత్రమే అన్నారు.
https://x.com/UttarandhraNow/status/1831117809642017196
ఏపీలోని కృష్ణాజిల్లా, తెలంగాణలోని ఖమ్మం జిల్లా కవల పిల్లలలాంటివి అని అన్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఈ రెండు జిల్లాల్లో వరదలు వచ్చాయని, ఏ జిల్లాలో పరిస్థితులు ఎలా ఉన్నాయో ప్రజలకు స్పష్టంగా తెలుస్తోందన్నారాయన. తెలంగాణ ప్రభుత్వం అప్రమత్తంగా ఉండటం వల్లే ఖమ్మంలో జలవిలయం ప్రభావం తక్కువగా ఉందన్నారు. అటు విజయవాడ వాసులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని పరోక్షంగా ఏపీ ప్రభుత్వంపై సెటైర్లు వేశారు రేవంత్ రెడ్డి. రెండు జిల్లాల్లో ఒకేరకమైన వర్షం, వరదలు వచ్చాయని వివరించారు. రెండు చోట్లా జరిగిన నష్టాన్ని అంచనా వేస్తే తెలంగాణ ప్రభుత్వం ఏ స్థాయిలో అప్రమత్తంగా ఉందో అర్థమవుతుందన్నారు రేవంత్ రెడ్డి.
వరద కష్టాలపై తెలంగాణ ప్రభుత్వాన్ని విమర్శించే క్రమంలో ఇటీవల కేటీఆర్ ఓ ఆసక్తికర ట్వీట్ వేశారు. ఏపీ ప్రభుత్వం హెలికాప్టర్లు, స్పీడ్ బోట్లతో సహాయక చర్యలు చేపట్టిందని, కానీ తెలంగాణ ఒక్క హెలికాప్టర్ కూడా తెప్పించుకోలేకపోయిందన్నారు. దీన్ని కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యంగా పేర్కొన్నారు. దీనికి కౌంటర్ గా రేవంత్ రెడ్డి తాజా వ్యాఖ్యలు చేశారు. ఏపీకంటే తామే మెరుగ్గా పనిచేశామన్నారు. ఈ క్రమంలో ఆయన ఏపీ ప్రభుత్వ అప్రమత్తతపై పరోక్ష విమర్శలు చేయడం చర్చనీయాంశంగా మారింది. ఖమ్మం జిల్లాను తాము కాపాడుకోగలిగామని, బెజవాడలో మాత్రం నష్టం అనివార్యంగా మారిందన్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఈ వ్యాఖ్యలపై ఏపీ ప్రభుత్వం తరపున ఇంకా ఎవరూ స్పందించలేదు.