హైడ్రా ఏర్పాటుకి సంబంధించిన జీవో 99 చట్టబద్ధతను సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్ పై తెలంగాణ హైకోర్టు విచారణ ప్రారంభించింది. పిటిషనర్ల వాదనలు విన్న హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. హైడ్రా ఏర్పాటులో చట్టబద్ధత లోపించినట్టు హైకోర్టు అభిప్రాయపడింది. అయితే జీవో 99 అమలుపై స్టే విధించేందుకు మాత్రం న్యాయస్థానం నిరాకరించింది. GHMC అధికారాలను హైడ్రాకు ఎలా బదిలీ చేశారో చెప్పాలంటూ ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది. హైడ్రా ఏర్పాటుతోపాటు దాని చట్టబద్ధత, విధులు, బాధ్యతలపై సమగ్ర వివరాలను అందజేయాలని ఆ నోటీసుల్లో స్పష్టం చేసింది.
హైడ్రా కూల్చివేతలపై కూడా హైకోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది. ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా, వివరణ తీసుకోకుండా ఎలా కూల్చేస్తారని ప్రశ్నించింది. ఇటీవల కోర్టు నుంచి మధ్యంతర ఉత్తర్వులు ఉన్నప్పటికీ అమీన్ పూర్లో కొన్ని షెడ్లు కూల్చివేశారననే విషయాన్ని పిటిషనర్లు న్యాయమూర్తి దృష్టికి తీసుకెళ్లారు. దీంతో నోటీసులివ్వకుండా కూల్చివేతలేంటని న్యాయస్థానం ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. ఇతర ప్రభుత్వ శాఖల అనుమతులతో జరిపిన నిర్మాణాలకు నోటీసులివ్వకుండా, యజమానుల వివరణ తీసుకోకుండా కూల్చివేయడాన్ని ఏవిధంగా సమర్థించుకుంటారని నిలదీసింది.
కోర్టు లేవనెత్తిన ప్రశ్నల్లో కొన్ని కీలక అంశాలున్నాయి. GHMCకి ఉన్న అధికారాలను హైడ్రాకి ఎలా బదలాయిస్తారని సూటిగా ప్రభుత్వాన్ని ప్రశ్నించింది న్యాయస్థానం. నోటీసులివ్వకుండా కూల్చివేతలెందుకు చేపట్టారో చెప్పాలన్నది. తదుపరి విచారణను హైకోర్టు రెండు వారాలు వాయిదా వేసింది. ఈ క్రమంలో హైడ్రా దూకుడు కాస్త తగ్గే అవకాశమున్నట్టు తెలుస్తోంది. కోర్టు అడిగిన ప్రశ్నలకు ప్రభుత్వం సంతృప్తికర సమాధానాలు ఇస్తుందా, లేక 99 జీవోపై తడబడి అక్షింతలు వేయించుకుంటుందా.. అసలు హైడ్రా భవిష్యత్ ఏంటి అనేది వేచి చూడాలి.