రాబోయే ఎన్నికల్లో జనసేన తరపున పోటీ చేయబోయే పది మంది అభ్యర్థులతో అధినేత పవన్ కల్యాణ్ రెండో జాబితాను ఫైనల్ చేశారు. ఈ జాబితాను చూస్తే జనసేన పరిస్థితి ఎంత ధీనంగా ఉందనే విషయం అర్థమైపోతుంది. కారణం ఏమిటంటే తొమ్మిది మంది అభ్యర్థుల్లో ఎక్కువ మంది వైసీపీ, టీడీపీ నేతలే. పదేళ్ళ క్రితం పార్టీ పెట్టిన పవన్ ఇప్పటివరకు నియోజకవర్గాల్లో గట్టి అభ్యర్థులను కూడా తయారు చేసుకోలేకపోయారు. గ్రామ కమిటీల నుండి రాష్ట్ర స్థాయి కమిటీలను కూడా వేయలేకపోయిన పవన్ ఇక అభ్యర్థులను ఏం తయారు చేసుకుంటారనే సెటైర్లు పేలుతున్నాయి.
ఇప్పుడు విషయం ఏమిటంటే రాజోలు అభ్యర్థిగా డాక్టర్ వరప్రసాద్, పెందుర్తి నుండి పంచకర్ల రమేష్, యలమంచిలిలో సుందరపు విజయ్ కుమార్, విశాఖపట్నం దక్షిణం నియోజకవర్గం నుండి వంశీకృష్ణయాదవ్, భీమవరానికి పులపర్తి రామాంజనేయులు(అంజిబాబు), తాడేపల్లిగూడెంలో బొలిశెట్టి శ్రీనివాస్, తిరుపతికి ఆరణి శ్రీనివాసులు, ఉంగుటూరు నుండి ధర్మరాజు, నరసాపురంలో బొమ్మిడి నాయకర్‌ను ఫైనల్ చేశారు. వీళ్ళని పిలిపించుకుని మాట్లాడి నామినేషన్ పేపర్లు రెడీ చేసుకోమని చెప్పేశారు. పిఠాపురంలో పవన్ పోటీ చేయటం ఖాయమంటున్నారు.
పై అభ్యర్థుల జాబితాను చంద్రబాబు, పవన్ గురువారం అధికారికంగా ప్రకటించబోతున్నారు. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే రాజోలులో పోటీ చేయబోతున్న వరప్రసాద్ గూడురు వైసీపీ ఎమ్మెల్యే. పెందుర్తిలో పోటీ చేయబోతున్న పంచకర్ల రమేష్ వైసీపీ నుండే వచ్చారు. తిరుపతి అభ్యర్థి ఆరణి శ్రీనివాసులు చిత్తూరు వైసీపీ ఎమ్మెల్యే, విశాఖ దక్షిణం నియోజకవర్గం నుండి పోటీ చేయబోతున్న ఎమ్మెల్సీ వంశీ యాదవ్‌పై మొన్ననే అనర్హత వేటుపడింది. ఈయన కూడా వైసీపీ నుండే వచ్చారు. భీమవరంలో పోటీ చేయబోతున్న పులపర్తి రామాంజనేయులు టీడీపీ మాజీ ఎమ్మెల్యే, తాడేపల్లిగూడెంలో పోటీ చేయబోతున్న బొలిశెట్టి కూడా ఒకప్పుడు టీడీపీ నేతే.
విచిత్రం ఏమిటంటే వరప్రసాద్, శ్రీనివాసులు ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయకపోయినా పవన్ టికెట్లిచ్చేశారు. ఈ జాబితా చూసిన తర్వాత జనసేన పరిస్థితి ఏమిటో అర్థమైపోతోంది. తొమ్మిది మంది అభ్యర్థుల్లోనే వైసీపీ, టీడీపీ నేతలు ఇంతమంది ఉన్నారు. పవన్‌ను మినహాయించి మిగిలిన ఏడు చోట్ల కూడా అభ్యర్ధులను ప్రకటిస్తే ఇంకెంతమంది వైసీపీ, టీడీపీ నేతలకు టికెట్లు దక్కుతాయో చూడాలి.