తెలుగు రాష్ట్రాలకు కేంద్రం వరదసాయం ప్రకటించింది. ఏపీ, తెలంగాణకు కలిపి రూ.3,300 కోట్లు విడుదల చేసినట్టు తెలిపింది. తక్షణ సహాయక చర్యల కోసం ఈ నిధులు విడుదల చేశామని కేంద్రం చెప్పింది. కేంద్ర వ్యవసాయశాఖ మంత్రి శివరాజ్‌సింగ్ చౌహాన్‌తో పాటు, పలువురు కేంద్ర ప్రతినిధులు రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ పర్యటించారు. వరద నష్టంపై వారు ఓ అంచనాకు వచ్చారు. కేంద్రం తరపున రూ.3,300 కోట్లు ఇస్తున్నట్టు తెలిపారు.
https://x.com/revanth_anumula/status/1832046207985758390
ఏపీలో కేంద్ర బృందానికి వరద నష్టాన్ని వివరించారు సీఎం చంద్రబాబు. భారీ వర్షాలు, వరదలతో 1.81 లక్షల హెక్టార్లలో పంట నష్టం జరిగిందని, 2 లక్షల 5వేలమంది మంది రైతులు రూ.1,056 కోట్ల మేర నష్టపోయారని తెలిపారు. రాష్ట్రంలోని 12 జిల్లాల్లో 19,453 హెక్టార్లలో ఉద్యాన పంటలు దెబ్బతిన్నాయని వివరించారు. భారీ వర్షాలు, వరదలకు రాష్ట్రంలో 3,756 కిలోమీటర్ల మేర రోడ్లు దెబ్బతిన్నాయని కూడా చెప్పారు. ఆక్వా రంగానికి కూడా నష్టం వాటిల్లిందని కేంద్ర మంత్రికి సీఎం చంద్రబాబు వివరించారు. అటు రాష్ట్ర ప్రతినిధులతో కలసి శివరాజ్ సింగ్ చౌహాన్ క్షేత్ర స్థాయి పర్యటనకు వెళ్లారు. అనంతరం ఆయనకు ఫొటో ఎగ్జిబిషన్ ద్వారా నష్టాన్ని వివరించారు సీఎం.
https://x.com/JaiTDP/status/1831723178969985449
అటు తెలంగాణలో కూడా అండగా ఉంటామని కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ప్రకటించారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం కేంద్రం నిధులను దారి మళ్లించిందని, ఎస్‌డీఆర్‌ఎఫ్ నిధులను సరిగ్గా వినియోగించుకోలేదని ఆయన విమర్శించారు. ప్రస్తుతం తెలంగాణలో వరదల కారణంగా వరి, ఇతర పంటలు బాగా దెబ్బతిన్నాయన్నారు. గతంలో ఎప్పుడూ ఇలాంటి పరిస్థితులు చూడలేదని, పశువులు, ఇతర మూగ జీవాలు ప్రాణాలు కోల్పోయాయని అన్నారు. కేంద్ర ప్రభుత్వం తరఫున వరద బాధితులకు అండగా నిలుస్తామని చెప్పారు శివరాజ్ సింగ్ చౌహాన్. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, కేంద్ర మంత్రి, బీజేపీ నేత బండి సంజయ్.. రాష్ట్రానికి జరిగిన నష్టాన్ని కేంద్ర బృందానికి వివరించారు.