భారత రెజ్లర్లు వినేష్ ఫోగట్, భజరంగ్ పునియా.. కాంగ్రెస్ పార్టీలో చేరారు. రాజకీయాల్లోకి వచ్చారు కాబట్టి దాదాపుగా ప్రొఫెషనల్ రెజ్లింగ్ కి వారు గుడ్ బై చెప్పినట్టే అనుకోవాలి. అదే సమయంలో వారు రైల్వేలో తమ ఉద్యోగాలకు కూడా రాజీనామా చేశారు. ఇటీవలే రాహుల్ గాంధీని కలిసిన వీరిద్దరూ ఈరోజు కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ సమక్షంలో కండువాలు కప్పుకున్నారు. అనంతరం ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గేని వారు కలిశారు.
https://x.com/ANI/status/1831996362923135170
హర్యానా బరిలో..
హర్యానా అసెంబ్లీ ఎన్నికల వేళ రెజ్లర్లిద్దరూ కాంగ్రెస్ పార్టీలో చేరడం కీలక పరిణామంగా భావిస్తున్నారు రాజకీయ విశ్లేషకులు. వీరిద్దరూ హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయడానికి సిద్ధమైనట్టు తెలుస్తోంది. అయితే వారు పోటీ చేసే స్థానాలపై క్లారిటీ రావాల్సి ఉంది. ఇటీవల ఒలింపిక్స్ లో వినేష్ ఫోగట్ డిస్ క్వాలిఫై కావడం సంచలనంగా మారింది. ఆమెపై కుట్ర జరిగిందనే ఆరోపణలు కూడా ఉన్నాయి. చివరి వరకు పతకం కోసం ఆమె న్యాయపోరాటం చేసినా ఫలితం లేకుండా పోయింది. ఒలింపిక్స్ అనంతరం వినేష్ ఫోగట్ తో పాటు, భజరంగ్ పునియా కూడా కాంగ్రెస్ తీర్థం పుచ్చుకోవడం విశేషం. గతంలో మహిళా రెజ్లర్ల తరపున కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా జరిగిన ఆందోళనల్లో వీరిద్దరూ చురుగ్గా పాల్గొన్నారు.
ఇక హర్యానా ఎన్నికల విషయానికొస్తే ప్రస్తుతం అధికార బీజేపీకి అక్కడ సానుకూల పరిస్థితులు లేవు. కాంగ్రెస్ ఆ రాష్ట్రాన్ని హస్తగతం చేసుకోడానికి ప్రయత్నిస్తోంది. ఇటీవల జరిగిన లోక్ సభ ఎన్నికల్లో హర్యానాలోని 10 సీట్లలో బీజేపీ, కాంగ్రెస్ చెరో 5 స్థానాల్లో గెలిచాయి. గతంలోకంటే కాంగ్రెస్ బలం ఇక్కడ భారీగా పెరిగింది. అసెంబ్లీ ఎన్నికల్లో కూడా అవే ఫలితాలు రిపీట్ అవుతాయని హస్తం పార్టీ ఆశిస్తోంది. పొత్తులో భాగంగా ఆమ్ ఆద్మీ పార్టీకి సీట్లు కేటాయించే విషయంలో కాంగ్రెస్ తర్జన భర్జన పడుతోంది. చేరికలతో కాంగ్రెస్ బలం పెంచుకోవాలని చూస్తోంది.