ఆంధ్రప్రదేశ్ జీవనాడి అయిన పోలవరం ప్రాజెక్టును నాశనం చేసింది టీడీపీనే అని వైసీపీ, కాదు వైసీపీ అనే టీడీపీ ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుంటున్నాయి. ప్రాజెక్టు నిర్మాణం విషయంలో నేతల మధ్య మాటల యుద్ధమే జరుగుతోంది. చంద్రబాబు తప్పిదాల వల్లే పోలవరం ప్రాజెక్టుకు ఈ దుస్థితి పట్టిందని మాజీ మంత్రి అంబటి రాంబాబు ఆరోపిస్తుంటే.. లేదు లేదు వైసీపీ చేసిన పొరపాట్ల వల్లే అంటూ ప్రస్తుత ఇరిగేషన్ శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు విమర్శిస్తున్నారు.
చర్చకు సిద్ధమా.. – అంబటి రాంబాబు
పోలవరం ప్రాజెక్టు పనుల్లో జాప్యం పాపం ముమ్మాటికీ చంద్రబాబుదే అని, దమ్ముంటే దానిపై చర్చకు రావాలని మాజీ మంత్రి అంబటి రాంబాబు సవాల్ విసిరారు. తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. చంద్రబాబు తప్పిదం వల్లనే డయాఫ్రమ్ వాల్ కొట్టుకుపోయిందన్న ఆయన, దాని వల్లే పోలవరం ప్రాజెక్టు పనులు ఆలస్యమయ్యాయని వెల్లడించారు. అత్యంత ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్టు పనులను ప్రొటోకాల్ ప్రకారం చేయలేదన్న ఆయన, ఇదే విషయాన్ని అంతర్జాతీయ నిపుణుల బృందం కూడా స్పష్టం చేసిందని గుర్తు చేశారు. పోలవరం ప్రాజెక్టు పనుల్లో చంద్రబాబు నిర్ణయాలన్నీ తప్పు అని, అయినా కూడా చంద్రబాబు అదే పనిగా గోబెల్స్ ప్రచారం చేశారని, తన అనుకూల ఎల్లో మీడియాతో తమపై బురద చల్లాలని చూశారని తెలిపారు. 2019లో వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాతే ప్రాజెక్టు పనులన్నీ గాడిలో పడ్డాయన్న ఆయన, వరదను మళ్లించేలా స్పిల్‌వే, స్పిల్ ఛానల్‌ను పూర్తి చేశామని ఎగువ కాఫర్ డ్యామ్‌నూ వేగంగా పూర్తి చేసి, దాని ద్వారా గోదావరి ప్రవాహాన్ని స్పిల్‌వే మీదుగా మళ్లించామని చెప్పారు. ఇంకా దిగువ కాఫర్ డ్యామ్‌లో కోతకు గురైన ప్రాంతాన్ని జియో బ్యాగ్‌లలో ఇసుక నింపి పూడ్చేశామని, 2023 ఫిబ్రవరి నాటికి దిగువ కాఫర్ డ్యామ్‌నూ పూర్తి చేశామని వివరించారు. ప్రొటోకాల్ ప్రకారం పనులు చేయడం వల్ల, అవన్నీ పటిష్టంగా ఉన్నాయని, ఇదే విషయాన్ని అంతర్జాతీయ నిపుణుల కమిటీ కూడా వెల్లడించిందని చెప్పారు. కేవలం చంద్రబాబు తప్పిదం, ఆయన అవినీతి, అవగాహన రాహిత్యం వల్లనే డయాఫ్రమ్ వాల్ కొట్టుకుపోయిందన్నారు.
కాదు మీ వల్లే డయాఫ్రం వాల్ దెబ్బతింది – రామానాయుడు
వైసీపీ హయాంలో ఎగువ కాఫర్ డ్యామ్ నిర్మాణం పూర్తికాకపోవడం వల్ల 2020 భారీ వరదలకు డయాఫ్రమ్ వాల్ దెబ్బతిన్నమాట వాస్తవం కాదా అని మంత్రి నిమ్మల ప్రశ్నించారు. 2014-19మధ్య ఉన్న ఏజెన్సీలను రద్దు చేయడం వల్లే కొత్త ఏజెన్సీ పనులు చేపట్టడానికి 13నెలల సమయం పట్టిందని మంత్రి చెప్పారు. వైసీపీ తీరు వల్ల ఆ 13నెలల సమయమంతా వృథా అయ్యిందన్నారు. 2014-19 మధ్య గత టీడీపీ ప్రభుత్వం పోలవరానికి రూ.11,500 కోట్లకు పైగా ఖర్చు పెట్టిందన్నారు. వైసీపీ ఐదేళ్ల పాలనలో రూ. 4,167కోట్లు మాత్రమే ఖర్చు పెట్టారన్నారు. పోలవరం నిధులను ప్రాజెక్టు కోసం ఖర్చుపెట్టకుండా దారి మళ్లించారని ఆరోపించారు. పోలవరం ప్రాజెక్టు గైడ్ బండ్ కుంగిపోవడం సహా అంచనాలు పెంచి టెండర్లు పిలిచిన అంశాలన్నీ ఒక్కొక్కటిగా బయటికొస్తున్నట్లు మంత్రి తెలిపారు. శాఖాపరంగా దీనికి బాధ్యులైన వారిపై చర్యలు తీసుకుంటామని మంత్రి హెచ్చరించారు.
ఫైల్స్ దగ్ధంపై క్లారిటీ ఇచ్చిన అధికారులు
పొలవరం ఫైల్స్ దగ్ధం అంటూ ఉద్దేశపూర్వక కథనాలతో కొన్ని మీడియా ఛానళ్లు హడావిడి చేశాయి. అయితే దీనిపై అధికారులు వివరణ ఇచ్చారు. అవి ఫైల్స్ కావని, పనికిరాని కాగితాలని, వాటి మీద వచ్చిన కథనాల్లో ఏమాత్రం వాస్తవం లేదని అధికారులు వివరణ ఇచ్చారు. పోలవరం ఎల్ఎంసీ కార్యాలయంలో బీరువాల్లో నిరుపయోగమైన కాగితాలను మాత్రమే బయటపడేశాం. ఈ పేపర్లు ఆర్ అండ్ ఆర్ కు ఏ మాత్రం సంబంధించినవి కావు. సిబ్బంది తగలబెట్టిన కాగితాలు ఉపయోగం లేనివి మాత్రమే అని ఆర్ అండ్ ఆర్ స్పెషల్ కలెక్టర్ సరళ తెలిపారు.