ముఖ్యమంత్రి వైఎస్ జగన్ రాష్ట్రానికి ఒక్క రాజధాని కూడా లేకుండా చేశారని ఇటీవల ప్రధాని నరేంద్ర మోదీ అంటే.. మోదీజీ… మీరు పునాది వేసిన అమరావతి ఇప్పుడిలా అంటూ రామోజీనావు ఈనాడులో అత్యంత ఆవేదనను వెళ్లగక్కుతూ ఓ వార్తా కథనాన్ని ప్రచురించింది. అసలు అమరావతి రాజధాని పేర టీడీపీ అధ్యక్షుడు నారా చంద్రబాబు చేసిన భూబాగోతం ఏమిటో, కమిటీల సిఫారస్సులను కూడా తుంగలో తొక్కి ఎందుకు అమరావతి పాట పాడారో, ఇంకా పాడుతున్నారో ఒక్కసారి చూద్దాం.
అసలు ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతిని నిర్ణయించి, దానికి శ్రీకారం చుట్టడం వెనక చంద్రబాబు ఆంతర్యం ఏమిటనేది ఇప్పటికే చాలా వరకు ప్రజలకు తెలిసిపోయింది. శివరామకృష్ణన్ కమిటీ హెచ్చరికలను ఆయన పట్టించుకోలేదు. శివరామకృష్ణన్ ఏ అనర్థాలైతే జరుగుతాయని హెచ్చరించారో, ఆ అనర్థాల కోసమే ఆయన అమరావతికి శ్రీకారం చుట్టారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం కాకుండా తను, తన వర్గం ప్రయోజనాల కోసం భారీ ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టారు.
రాజధాని అమరావతి నిర్మాణం కోసం 29 గ్రామాలకు చెందిన 33 వేల ఎకరాలను అప్పటి చంద్రబాబు ప్రభుత్వం స్వాధీనం చేసుకుంది. ఏడాది పొడవునా పంటలు పండే భూములతో పాటు సాగు భూములు కూడా వీటిలో ఉన్నాయి. 2013 భూసేకరణ, పునరావాసం, రీసెటిల్మెంట్ చట్టం ప్రకారం 70 శాతం కుటుంబాలు అంగీకరిస్తేనే భూములను స్వాధీనం చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అయితే, ఉండవల్లి, పెనుమాక గ్రామాల్లోని ప్రజలు తమ భూములు ఇవ్వడానికి నిరాకరించారు. అయినా, అప్పటి చంద్రబాబు ప్రభుత్వం వెనక్కి తగ్గలేదు.
అమరావతి ప్రాంతాన్ని రాజధానిగా ప్రకటించడానికి ముందే చంద్రబాబు సన్నిహితులు, టీడీపీ నాయకులు ఆ ప్రాంతాల్లో భూములు కొనుగోలు చేశారు. అమరావతి ప్రాంతంలో తాను భూమి కొనుగోలు చేసినట్లు టీడీపీ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ స్వయంగా చెప్పారు. అమరావతి ప్రాంతంలో ఇన్సైడర్ ట్రేడింగ్ జరిగినట్లు ఆరోపణలున్నాయి. 4,070 ఎకరాల ఇన్సైడర్ ట్రేడింగ్ జరిగినట్లు చెబుతున్నారు. ఈ ఆరోపణలపై కేసులు కూడా నడుస్తున్నాయి.
ఒక రాష్ట్రానికి అంత సువిశాలమైన రాజధాని అవసరమా, దానికి అంత ఖర్చు అవసరమా అనే ప్రశ్నలు వేసుకోవాల్సిన అవసరం ఉంది. లక్షా 9 వేల కోట్ల అంచనా వ్యయంతో చంద్రబాబు ప్రభుత్వం రాజధాని నిర్మాణాన్ని చేపట్టింది. అయితే, చంద్రబాబు ఐదేళ్ల పాలనలో దాని కోసం ఖర్చు చేసింది కేవలం 9,165 కోట్ల రూపాయలు మాత్రమే. మరో లక్ష కోట్ల రూపాయలు ఖర్చు చేయాల్సి ఉంటుంది. ఈ లెక్కన చూస్తే రాజధాని నిర్మాణానికి ఎన్నేళ్లు పడుతుందో అర్థం చేసుకోవచ్చు. పైగా ఎప్పటికప్పుడు నిర్మాణ వ్యయం కూడా పెరుగుతూ వుంటుంది. అమరావతి ప్రాంతంలో నిర్మించిన తాత్కాలిక నిర్మాణాల పరిస్థితి ఏమిటో అనుభవంలోకి వచ్చిందే. వర్షానికి కూడా తట్టుకోలేని పరిస్థితిలో ఉన్నాయి. వర్షం పడితే నీళ్లు కారేవి. ఆ సమయంలో ముఖ్యమంత్రి హోదాలో చంద్రబాబు సీఆర్డీఏ అధికారులను హెచ్చరించారు కూడా.
రాష్ట్ర విభజనతో ఆంధ్రప్రదేశ్ హైదరాబాద్‌ను కోల్పోయింది. అత్యధిక రెవెన్యూను సాధించి పెట్టే హైదరాబాద్‌ను కోల్పోయిన తర్వాత సంక్షేమ, అభివృద్ధి పథకాల కోసం ఆర్థిక వనరులను సమీకరించుకుని ఖర్చు చేయాల్సిన అవసరం ఉంటుంది. విభజన వల్ల ప్రజలపై ప్రతికూల ప్రభావం పడకుండా చూసుకోవాల్సి ఉంటుంది. ఆ విషయాన్ని మరిచిపోయి చంద్రబాబు అమరావతిపై దృష్టి పెట్టారు.
కేవలం రాష్ట్రం కోసం దాన్ని చేపట్టారంటే నమ్మడానికి ఎవరూ సిద్ధంగా ఉండరు. ఒక సామాజిక వర్గానికి ప్రయోజనం చేకూరుస్తూ, తనకూ, తనవారికి వ్యక్తిగత ప్రయోజనం చేకూర్చడానికి మాత్రమే అంత భారీ ప్రాజెక్టును చేపట్టారు. ఐదేళ్ల తన పాలనలో అమరావతి కోసం రూపొందింంచిన డిజైన్లు నాసిరకంగా ఉన్నాయి. డిజైన్ల రూపకల్పనకు ఆయన ముగ్గురు ఆర్కిటెక్ట్‌లను మార్చారు. వారికి వందల కోట్ల రూపాయలు చెల్లించాల్సి వచ్చింది.
శివరామకృష్ణన్ కమిటీ సూచనలకు విరుద్ధంగా..
రాష్ట్ర విభజనకు సంబంధించిన 2014లోని సెక్షన్ 5, 6లను అనుసరించి కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ నూతన రాజధాని కోసం శివరామకృష్ణన్ నేతృత్వంలో ఓ కమిటీ వేసింది. ఆ కమిటీ రాజధాని విషయంలో నిర్దిష్టమైన సూచనలు చేసింది. ఆ కమిటీ సూచనలను చంద్రబాబు ఏ మాత్రం పట్టించుకోలేదు. పైగా, ఆ కమిటీ సూచనలకు విరుద్ధంగా నిర్ణయం తీసుకున్నారు. ఆంధ్రప్రదేశ్ భౌగోళిక పరిస్థితుల దృష్ట్యా అతి పెద్ద రాజధాని సరికాదని శివరామకృష్ణన్ కమిటీ సూచించింది. విజయవాడ, గుంటూరు మధ్య రాజధాని ఏర్పాటు సరికాదని కూడా చెప్పింది. విజయవాడ, గుంటూరు, తెనాలి, మంగళగిరి అర్బన్ డెవలప్మెంట్ ఏరియా గోవా కన్నా పెద్దదని, ఇంత పెద్ద నగరాన్ని నిర్మించి పట్టణీకరణ చేసి హైదరాబాద్‌కు మాదిరిగా రింగ్ రోడ్డు నిర్మించడం సరికాదని కూడా చెప్పింది. దానికి తోడు, ఆ ప్రాంతంలో అత్యుత్తమ సాగు భూములున్నాయని, చిన్న కమతాలు చాలా ఉన్నాయని, రైతు కూలీలు పెద్ద సంఖ్యలో ఉన్నారని, అందువల్ల ఆ ప్రాంతాన్ని రాజధానిగా ఎంపిక చేయడం సరికాదని చెప్పింది.
శివరామకృష్ణన్ కమిటీ అత్యంత ముఖ్యమైన హెచ్చరిక ఒకటి చేసింది. అంత పెద్ద రాజధాని నిర్మాణాన్ని చేపట్టడం వల్ల కృత్రిమ రియల్ ఎస్టేట్ వ్యాపారం పెరుగుతుందనేది ఆ హెచ్చరిక. నిజానికి, చంద్రబాబు నాయుడు ఈ కృత్రిమ రియల్ ఎస్టేట్ వ్యాపారాన్ని ఆశించే అమరావతి ప్రాంతాన్ని రాజధానిగా ఎంపిక చేశారనేది నిస్సందేహం. ఈ కృత్రిమ రియల్ ఎస్టేట్ వ్యాపారం ద్వారా తనకు, తనవారికి ప్రయోజనం చేకూరే విధంగా ఆయన వ్యవహరించారు. రాష్ట్రంలో రాజధానిని, అధికార వ్యవస్థలను వికేంద్రీకరించాలని, ప్రభుత్వ వ్యవస్థలను వివిధ ప్రాంతాల్లో ఏర్పాటు చేయాలని, అసెంబ్లీ, సచివాలయం ఉన్న చోటనే హైకోర్టు ఉండాలని ఏమీ లేదని, హైకోర్టును ఒక చోట పెట్టి మరో చోట బెంచీ పెట్టాలని, ఉత్తరాంధ్ర, రాయలసీమ ప్రాంతాల్లో అధికార వ్యవస్థలు ఉండేలా చూడాలని శివరామకృష్ణన్ కమిటీ సూచించింది. ఈ సూచనలను చంద్రబాబు ప్రభుత్వం ఏ మాత్రం పట్టించుకోలేదు. వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ సూచనలను అమలు చేయడానికి వైఎస్ జగన్ ప్రభుత్వం పూనుకుంది. జగన్ ప్రభుత్వ చర్యలకు టీడీపీ అడ్డుపడుతూ వస్తోంది.