ఏపీలో ప్రస్తుతం అధికారంలో ఉన్న కూటమి సర్కార్.. గత వైసీపీ ప్రభుత్వం, ప్రభుత్వాధినేతపై ఎన్నో రకాల ఆరోపణలు చేసింది. మూడు పార్టీలు కలిసి జగన్ పార్టీపై, ప్రభుత్వంపై అనేక నిందలు వేశాయి. అందులో అతి ప్రధానమైనది మహిళల మిస్సింగ్. ఈ అంశం అప్పట్లో దేశ వ్యాప్తంగా సంచలన టాపిక్ అయ్యింది. 30 వేల మంది మిస్సింగ్ అంటే మామూలు మాటలా..?
ఏపీలో 30 వేల మంది మహిళలు మిస్సయ్యారంటూ జనసేన అధినేత పవన్ ఎన్నికల ముందు ప్రతి సభలోనూ ప్రసంగించారు. జగన్ ఏర్పాటు చేసిన వలంటీర్ సిస్టమ్ ద్వారా ఇల్లీగల్ హ్యూమన్ ట్రాఫికింగ్ జరిగిందని, ఇతర దేశాలకు మహిళలను తరలించారంటూ గత వైసీపీ ప్రభుత్వంపై పవన్ నింద వేశాడు. పవన్ మాటలకు బీజేపీ, టీడీపీ కూడా బ్యాగ్రౌండ్ స్కోర్ అందించాయి. ఈ విషయంపై కేంద్ర ప్రభుత్వ పెద్దలతో మాట్లాడానని, వారు జగన్ పనిపడతారని ఓ రకంగా జగన్‌ను బెదిరించేంత పనిచేశారు పవన్. మిస్సయిన 30 వేల మందిలో 14 వేల మంది తిరిగివచ్చారని, మిగతా 16 వేల మంది ఏమయ్యారని ప్రతి సందర్భంలోనూ ప్రశ్నించారు. వలంటీర్ల ద్వారా జగన్ ప్రభుత్వం ఒంటరి మహిళల డేటాను సేకరించి సంఘ విద్రోహ శక్తులకు అందిస్తే.. వారు కిడ్నాప్ చేశారని ఆరోపించారు. ఇదంతా ఆంధ్రప్రదేశ్‌లోని యువతకు, మహిళలకు, ఆడబిడ్డలకు చెప్పమని కేంద్ర నిఘా వర్గాలు తనకు చెప్పాయని పవన్ ఊదరగొట్టారు.
మరి అధికారం మారింది. మహిళల అక్రమ రవాణా అని ఆరోపించిన పవన్ ఇప్పుడు డిప్యూటీ సీఎం అయ్యారు. వలంటీర్ వ్యవస్థ కూటమి ప్రభుత్వం చేతుల్లోనే ఉంది. మిస్సయిన మహిళల డేటా ఎలాగూ పవన్ దగ్గర ఉండనే ఉంది. ఎందుకీ తాత్సారం.. త్వరితగతిన ఆ సమస్యను పరిష్కరించవచ్చు కదా. తప్పిపోయిన వారిని వారి సొంతవారి చెంతకు చేర్చే బాధ్యతను పవన్ తీసుకోవచ్చు కదా..
వైసీపీకి పట్టదా..
మహిళల అక్రమ రవాణా జరిగిందని గతంలో అనేక ఆరోపణలు చేసిన పార్టీలపై వైసీపీ కనీసం నోరెత్తడం లేదు. పార్టీని, తన హయాంలో స్ధాపించిన వలంటీర్ వ్యవస్థను బద్నాం చేసిన పార్టీలను కనీసం ప్రశ్నించే సాహసం కూడా వైసీపీ చేయలేకపోతోంది. రాష్ట్రంలో గత ఐదేళ్లలో మిస్సింగ్ కేసులు 1400 మాత్రమేనని అధికారంలో ఉండగా మహిళా కమిషన్‌తో చెప్పించిన వైసీపీ.. ఇప్పుడా అంశాన్ని లేవనెత్తి పవన్ ఆరోపణలను ఎందుకు తిప్పికొట్టడం లేదు. పవన్ చేసిన వ్యాఖ్యల్లో నిజం అంటే మిస్సయిన 16 వేల మందిని వెంటనే గుర్తించాలని, లేదంటే వలంటీర్ వ్యవస్థకు క్షమాపణ చెప్పాలని ఎందుకు డిమాండ్ చేయడం లేదు.