జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఇప్పుడు చెత్తగా మారిపోయారు. వైసీపీ ఎమ్మెల్యేల్లో కొందరిని, మంత్రుల్లో కొందరిని జగన్మోహన్ రెడ్డి నియోజకవర్గాలు మార్చారు. దానిపై చంద్రబాబు, లోకేష్ అండ్ కో అప్పట్లో పదేపదే ఆరోపణలు, విమర్శలు చేశారు. ఒక నియోజకవర్గంలో పనికిరాని చెత్త మరో నియోజకవర్గంలో బంగారమైపోతుందా? అంటు ఎకసెక్కాలాడారు. ఈ నియోజకవర్గంలో గెలవలేని పెద్ద మనుషులు మరో నియోజకవర్గంలో గెలుస్తారా అంటు పదేపదే ఎగతాళి చేశారు. జగన్ నిర్ణయాలను అప్పట్లో అంత ఎగతాళి చేసిన చంద్రబాబు కూడా తర్వాత అదే పద్ధతిని ఫాలోయ్యారు.
నిజానికి ఈ పద్దతిని 2019 ఎన్నికల్లోనే చంద్రబాబు మొదలుపెట్టారు. తాను చేస్తే సంసారం ఎదుటివాళ్ళు చేస్తే…. అనే రకం కదా చంద్రబాబు. 2019లో పాయకరావుపేట ఎమ్మెల్యే అనితను కొవ్వూరులో, కొవ్వూరు ఎమ్మెల్యే జవహర్‌ను తిరువూరులో పోటీ చేయించారు. అదేపని ఇప్పుడు జగన్ చేస్తే మాత్రం తట్టుకోలేకపోతున్నారు. ఇప్పుడు కూడా పెనమలూరు వైసీపీ ఎమ్మెల్యే కొలుసు పార్థసారథిని టీడీపీలోకి తీసుకుని నూజివీడులో టికెట్ ఇచ్చారు. ఇప్పుడు విషయం ఏమిటంటే పవన్ కల్యాణ్ పిఠాపురంలో పోటీ చేస్తున్నారు. ఈ విషయాన్ని తనంతట తానే ప్రకటించారు.
చంద్రబాబు, లోకేష్ దృష్టిలో పవన్ కూడా చెత్తేనా? భీమవరం, గాజువాకలో 2019 ఎన్నికల్లో ఓడిపోయిన పవన్ ఇప్పుడు పిఠాపురంలో పోటీ చేయాలని డిసైడ్ అవ్వగానే బంగారమైపోతారా? పై రెండు నియోజకవర్గాల్లో పనికిరాని చెత్త పిఠాపురంలో పోటీ చేస్తే గెలుస్తారా? పైగా జిల్లా కూడా దాటిపోయారు. పవన్ స్వస్థలం పశ్చిమగోదావరి జిల్లాలోని నర్సాపురం. కానీ రేపటి ఎన్నికల్లో పోటీ చేయబోతున్నది తూర్పుగోదావరి జిల్లాలోని పిఠాపురంలో. ఏ రకంగా చూసినా పవన్ బంగారమయ్యే అవకాశమే లేదు.
కాబట్టి నియోజకవర్గం దాటిపోవటమే కాకుండా ఏకంగా జిల్లానే దాటేసిన పవన్ బంగారమా? లేకపోతే చెత్తా? అన్న విషయాన్ని చంద్రబాబు, లోకేష్ చెబితే బాగుంటుంది. పిఠాపురంలో పోటీ చేస్తానని పవన్ ప్రకటించగానే నియోజకవర్గంలో మంటలు రేగాయి. పవన్+చంద్రబాబు ఫొటోలున్న పాంప్లెట్లు, పోస్టర్లు, బ్యానర్లన్నంటినీ రోడ్డు మీద వేసి తమ్ముళ్ళు తగలబెట్టేశారు. పవన్‌ను పిఠాపురంలో గెలవనిచ్చేదిలేదని, కచ్చితంగా ఓడగొడతామని మాజీ ఎమ్మెల్యే వర్మ మద్దతుదారులు వార్నింగులిస్తున్నారు. మరీ నేపథ్యంలో చంద్రబాబు, లోకేష్, పవన్ ఏం చేస్తారో చూడాల్సిందే.