ఏపీసీసీ అధ్యక్షురాలు షర్మిల ఈరోజు వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించారు. ప్రకాశం బ్యారేజ్ ని సందర్శించారు. సహజంగానే ఆమె కూటమి ప్రభుత్వాన్ని పల్లెత్తు మాట అనకుండా, గత ప్రభుత్వాన్ని విమర్శించారు. ఇంతవరకు ఓకే. షర్మిల ఎవరి డైరక్షన్లో ఉన్నారనే విషయం అందరికీ తెలిసిందే. వాస్తవానికి షర్మిల పర్యటనకు మీడియా కవరేజ్ కూడా పెద్దగా లేదు, ఎవరూ ఆమెను పట్టించుకోలేదు. అయితే ఆమె ఒకే ఒక్క మాటతో సోషల్ మీడియాలో ట్రెండింగ్ అయ్యారు. “రెయినీ సీజన్ అంటే రెయిన్స్ వచ్చే సీజన్” అంటూ షర్మిల అన్న మాట ఆమెను టాక్ ఆఫ్ సోషల్ మీడియాగా మార్చింది. వాట్సప్ స్టేటస్ లలో ఈరోజు ఆమె వీడియో వైరల్ అయింది.
https://x.com/MilagroMovies/status/1831281216974098439
“అసలు పాదయాత్ర అంటే ఏంటి..? పాదాల మీద నడిచే యాత్ర..” అంటూ గతంలో వైఎస్సార్టీపీ అధినేతగా తెలంగాణలో పర్యటిస్తున్న షర్మిల తనదైన శైలిలో అర్థం చెప్పారు. అప్పట్లో ఆ పాదయాత్ర మీనింగ్ ఎంత వైరల్ అయిందో అందరికీ తెలుసు. ట్రోలింగ్ మెటీరియల్ గా షర్మిల అప్పుడే సోషల్ మీడియాలో ఎంట్రీ ఇచ్చారు. ఆ తర్వాత “అసలు ఆడపిల్లను ఆడపిల్ల అని ఎందుకు అంటారో తెలుసా..? ఈడ పిల్లకాదు, ఆడపిల్ల” అంటూ మరో ఆణిముత్యం వదిలారు షర్మిల. మళ్లీ ఇన్నాళ్లకు మరోసారి సోషల్ మీడియాలో ట్రెండింగ్ లోకి వచ్చారు షర్మిల. “రెయినీ సీజన్ అంటేనే రెయిన్స్ వచ్చే సీజన్ కాబట్టి..” అంటూ మీడియాకి రెయినీ సీజన్ మీనింగ్ చాలా విపులంగా విడమరచి చెప్పారు.
పరామర్శ ఎపిసోడ్ తర్వాత షర్మిల వేసిన ట్వీట్ కూడా ఆసక్తికరంగా ఉంది. వరదల్లో సీఎం చంద్రబాబు చేస్తున్న సహాయక చర్యలు సంతోషకరం అంటూ సర్టిఫికెట్ ఇచ్చారు. తెలంగాణలో హైడ్రాలాగా బుడమేరు ఆక్రమణలు తొలగించేందుకు సరికొత్త వ్యవస్థ రావాలని కోరారు. “కొంప కొల్లేరు అయ్యింది.. బెజవాడ బుడమేరు అయింది. సింగ్ నగరలో వరద బాధితుల కష్టాలు వర్ణనాతీతం. బాధితులు పడుతున్న కష్టాలు స్వయంగా చూసి నా గుండె తరుక్కుపోయింది. వరదల్లో ఇప్పటికీ 35 మంది చనిపోయారు. 35వేల ఇళ్లు కూలిపోయాయి. మొత్తం 5 లక్షల మంది దాకా నష్టపోయారు. ఇంత భారీ ఎత్తున విపత్తు సంభవిస్తే ప్రధాని మోదీ కనీసం స్పందించలేదు. విజయవాడ వరదలు కేంద్రానికి కనిపించడం లేదా..? తక్షణమే దీనిని జాతీయ విపత్తుగా పరిగణించండి. వరదల్లో సీఎం చంద్రబాబు చేస్తున్న సహాయక చర్యలు సంతోషకరం. కానీ సహాయక చర్యలు గ్రౌండ్ లెవల్‌కి చేరడం లేదు. 2005లో ఇలాంటి వరదలు వస్తే అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ఆర్ ఇక్కడకు వచ్చారు. బుడమేరుకి వరదలు రాకుండా సమస్య పరిష్కారం చేయాలని చూశారు. ఆపరేషన్ కొల్లేరును క్లియర్ చేశారు. ఆరోజుల్లో బుడమేరు కరకట్టలు బలోపేతం చేశారు. కానీ గత 10 ఏళ్లలో బుడమేరులో ఆక్రమణలు జరిగాయి. తెలంగాణలో హైడ్రా మాదిరిగా బుడమేరు ఆక్రమణలు తొలగించి రిటైనింగ్ వాల్ కట్టాలి.” అంటూ ట్వీట్ వేశారు షర్మిల.