భద్రతా కారణాల దృష్ట్యా రాష్ట్ర పర్యటనలో జగన్మోహన్ రెడ్డి రెండు హెలికాప్టర్లు వాడబోతున్నారన్న నిర్ణయంపైన కూడా వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణంరాజు భోరున ఏడుస్తున్నారు. ప్రభుత్వం హెలికాప్టర్లను వాడకుండా అడ్డుకోవాలని కోరుతూ కేంద్ర ఎన్నికల కమిషన్‌కు లేఖ రాశారు. జగన్ పర్యటనల్లో రెండు హెలికాప్టర్లను వాడేందుకు విజయవాడ, విశాఖపట్నంలో ప్రత్యేక ఏర్పాట్లు చేయటం నిబంధనలకు విరుద్ధమన్నారు. ప్రభుత్వ ఖర్చుతో ఎన్నికల పర్యటనలు చేయాలని జగన్ అనుకోవటం దుర్మార్గమన్నారు.
నెలకు రెండు హెలికాప్టర్లకు రూ.3.82 కోట్లు ప్రభుత్వం ఖర్చుచేయటం అన్యాయమని రాజు మండిపడ్డారు. వ్యక్తిగత భద్రత పేరుతో హెలికాప్టర్లలో తిరగటం కోసమే జగన్ ప్లాన్ చేసినట్లు ఎంపీ తన ఫిర్యాదులో చెప్పారు. ఎన్నికల ఖర్చు నుంచి తప్పించుకునేందుకు జగన్ డ్రామాలాడుతున్నట్లు ఎంపీ మండిపోయారు. ఎంపీ ఫిర్యాదుపై ఎన్నికల కమిషన్ ఏ విధంగా స్పందిస్తుందనేది వేరే సంగతి. అయితే ఇక్కడ గమనించాల్సినది ఏమిటంటే ఎన్నికల సమయంలో ముఖ్యమంత్రులందరూ హెలికాప్టర్లలోనే పర్యటిస్తున్నారు. నరేంద్ర మోడీ కూడా విమానాల్లోనే పర్యటిస్తున్నారు. దగ్గరి దూరాలకైతే మోడీ కూడా హెలికాప్టర్లనే ఉపయోగించారు.
అధికారంలో ఉన్నపుడు చంద్రబాబు కూడా ఇలాగే హెలికాప్టర్లలో పర్యటించిన విషయం గుర్తుండే ఉంటుంది. ఇక్కడ విషయం ఏమిటంటే జగన్ ఏం చేసినా తప్పే ఏమీ చేయకపోయినా తప్పే. జగన్‌ను ఎలాగైనా ఇబ్బందుల్లో పెట్టాలన్న ఉద్దేశంతోనే ఎంపీ పదేపదే అనేక అంశాలపై వివిధ కోర్టుల్లో కేసులు వేస్తున్న విషయం తెలిసిందే. జగన్ బెయిల్ రద్దు చేయించాలని, జగన్‌ను మళ్ళీ జైలుకు పంపాలని ఎంపీ ఎన్ని విధాలుగా ప్రయత్నిస్తున్నా సాధ్యం కావటంలేదు. దాంతో రాజులో ఫ్రస్ట్రేషన్ బాగా పెరిగిపోతోంది.
ఇంకోవైపు రాబోయే ఎన్నికల్లో నరసాపురం పార్లమెంటు ఎన్నికల్లో పోటీ చేయాలని అనుకుంటున్నారు. అయితే ఎన్నికల్లో పోటీ చేయాలంటే ముందు రాష్ట్రంలోకి తర్వాత నరసాపురంలోకి అడుగుపెట్టాలి. అలా అడుగుపెడితే ఏమవుతుందో అనే భయం పెరిగిపోతోంది. ఆ భయాన్ని కనబడనీయకుండా మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శించటంలో భాగంగానే జగన్‌పైన పదేపదే కోర్టుల్లో కేసులు వేస్తున్నారు. జగన్‌కు వ్యతిరేకంగా కోర్టుల్లో కేసులు వేయటానికి, కేంద్ర ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదులు చేయటానికి ఎప్పెడుప్పుడు అవకాశం వస్తుందా అని ఎంపీ కాచుకుని కూర్చున్నట్లున్నారు. మరి జగన్‌పై ఎంపీ ఎప్పటికి పైచేయి సాధిస్తారో చూడాలి.